Kangana Ranaut Defamation Case: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోర్టు మెట్లు ఎక్కింది. ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ తన మీద వేసిన పరువు నష్టం కేసు విచారణపై స్టే విధించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి తాను వేసిన క్రాస్ పిటిషన్ ను కలిపి విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరింది.


కంగనాపై జావేద్ పరువు నష్టం దావా


తన పరువుకు నష్టం కలిగించేలా కంగనా పలు ఛానెళ్లలో మాట్లాడిందని ఆరోపిస్తూ, 2020లో జావేద్ అక్తర్ ఆమె మీద పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో కంగనా జావేద్ మీద క్రాస్ పిటిషన్ వేసింది. నేరపూరిత కుట్ర, ప్రైవసీకి భంగం కలిగించాడంటూ ఆయన మీద కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో జులూ 24, 2023లో న్యాయ స్థానం జావేద్ కు సమన్లు పంపించింది. వీటికి వ్యతిరేకంగా జావేద్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం కంగనా కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్, సమన్ల జారీపై స్టే విధించింది. 


జావేద్ బెదిరించాడని ఆరోపించిన కంగనా


అప్పట్లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం కూడా అప్పట్లో న్యాయస్థానానికి చేరింది. ఈ విషయం గురించి కంగనా పలు జాతీయ ఛానెళ్లతో మాట్లాడింది. హృతిక్ తో ప్రేమాయణం, గొడవల గురించి ప్రస్తావించింది. అదే సమయంలో జావేద్ తనను ఇంటికి పిలిచి బెదిరించాడని ఆరోపించింది. హృతిక్ లాంటి హీరోతో పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఉండవని వార్నింగ్ ఇచ్చాడని వెల్లడించింది. కంగనా వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే, తనపై అనవసర ఆరోపణులు చేసిందని జావేద్ తెలిపారు. తన పరువుకు నష్టం కలిగించిందంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.


రెండు కేసులను కలిపి విచారించాలని కోరిన కంగనా


తాజాగా జావేద్ అక్తర్, తన ఫిర్యాదులు ఒకే సంఘటనకు సంబంధించినవని కంగనా న్యాయస్థానానికి వెల్లడించారు. ఒకే కేసులో రెండు విరుద్ధ తీర్పులను ఇవ్వకుండా కలిపి విచారణ జరపాలని ఆమె అభిప్రాయపడింది. ఈ మేరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన పిటిషన్ మీద విచారణ నిలిచిపోయిందని చెప్పిన ఆమె, అక్తర్ వేసిన పిటిషన్ మీది విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఇలా విచారణ జరపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని వెల్లడించింది. అటు కంగన ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు త్వరలో విచారించనుంది.


కంగనాకు కలిసి రాని 2023


అటు కెరీర్ పరంగా కంగనాకు 2023 పెద్దగా కలిసి రాలేదు. గత ఏడాది ఆమె నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘తేజస్’, ‘చంద్రముఖి -2’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.  ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ రోజుల నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Read Also: ‘హనుమాన్’కు అన్యాయం, థియేటర్లను చేతిలో పెట్టుకుని నచ్చినట్లు చేస్తున్నారు: దిల్ రాజుపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం