Natti Kumar: సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల విషయంలో ఫిలిం ఛాంబర్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ చేతుల్లో పెట్టుకుని నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
‘హనుమాన్’ మూవీకి థియేటర్లు ఇవ్వడం లేదు- నట్టి కుమార్
సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ‘హనుమాన్’ సినిమా మినహా ఇతర సినిమాలన్నీ దిల్ రాజు, సునీల్ సంస్థలే పంపిణీ చేస్తున్నాయన్నారు. అందుకే, ఆ సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వడం లేదన్నారు. పెద్ద సినిమా అయిన ‘హనుమాన్’ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఫిలిం ఛాంబర్ పెద్దలు స్వార్థాన్ని పక్కన పెట్టి అన్ని సినిమాలకు థియేటర్లను ఇవ్వాలని గుర్తు చేశారు.“‘ఈగల్‘ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది. అది మేకర్స్ ఇష్టం. కానీ, ‘హనుమాన్’కు కావాల్సిన థియేటర్లను ఇవ్వాలి. ఈ సినిమా కూడా పెద్ద బడ్జెట్ తోనే తీశారు. ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు సరిగా కేటాయించలేదని ఆ సినిమా నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ ను బట్టి కాదు, సినిమాల క్రేజ్‌ను బట్టి థియేటర్స్ ఇవ్వాలి. పెద్ద సినిమాలకు వ్యతిరేకిని కాదు. నా దృష్టిలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు న్యాయం జరగాలని కోరుకుంటుంటాను. చిన్న సినిమాల నిర్మాతలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలి. ఈ అన్యాయంపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి” అని నట్టి కుమార్ తెలిపారు.
టికెట్ రేట్ల విషయంలో ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది- నట్టి కుమార్
ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమాల టికెట్ రేట్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నట్టి కుమార్ విమర్శించారు. నచ్చిన వారికి ఒకలా, నచ్చని వారి పట్ల మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. రూ. 100 కోట్ల బడ్జెట్ దాటితే టికెట్ పెంచుతామని చెప్పారని, ‘బ్రో’, ‘భగవంత్ కేసరి’ సినిమాల విషయంలో టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచాలని ‘నా సామిరంగ’ నిర్మాతలు కోరినట్లు తెలిసిందన్నారు. జగన్ ప్రభుత్వం నచ్చిన వారికి టికెట్ల రేట్లు పెంచేందుకు గైడ్ లైన్స్ ను పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లు ఉండాలని ఆయన కోరారు. సినిమాలకు అనవసరంగా బడ్జెట్ పెంచి, దాని భారం ప్రజలపై వేస్తున్నారని మండిపడ్డారు. సినీ అభిమానులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణి మానుకోవాలని సూచించారు. అన్ని సినిమాలను ఒకేలా చూడాలని కోరారు. లేదంటే, సినిమా పరిశ్రమకు ఇబ్బంది తప్పదని హెచ్చరించారు.
Read Also: ‘సూపర్ మ్యాన్’ కాదు అమీర్ ఖాన్ కొడుకు - అతడిని చూస్తే మీరూ ఇలాగే కన్‌ఫ్యూజ్ అవుతారు!