Revanth Reddy: ఈ నెల రోజులు కొత్త అనుభవం, పాలన తృప్తినిచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్

Telangana News: ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రయాణం కొత్త అనుభవాన్ని ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Continues below advertisement

Revanth Reddy News: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన 30 రోజుల అనుభవాన్ని పంచుకున్నారు. ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని అన్నారు. ఈ ప్రయాణం కొత్త అనుభవాన్ని ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల రోజుల పాటు సాగిన నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని అన్నారు.

Continues below advertisement

‘‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది.

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా - మీ రేవంతన్న’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Continues below advertisement