MLC Counting :    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 ఓట్లు ఉన్నాయి. అనూరాధకు కూడా 23 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు వస్తేనే ఓ అభ్యర్తి విజయం సాధించారు. అనూరాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దీంతో ఆమె విజయం ఖరారయింది.  టీడీపీ తపపున 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారు.   ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలని జగన్ పంతం పట్టారు. చాలా ఖర్చు పెట్టి హోటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యాంపులు నిర్వహించారు. ఓ అభ్యర్థికి ఇబ్బంది అయితే విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేశారు. కానీ మొత్తం శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  


వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తులు ఉన్నారని ముందుగానే గుర్తించి ఆ పార్టీ అధినాయకత్వం చాలా వరకూ బుజ్జగించింది. అప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న కొన్ని పనుల్ని కూడా చేసి పెట్టింది. ప్రతి అభ్యర్థికి 22 ఓట్లను డివైడ్ చేసి..  ఇద్దరు సీనియర్ నేతలతో కోఆర్డినేషన్ చేయించారు. అలా ఓట్లను కూడా  బృందాలుగా తీసుకెళ్లి వేయించారు. అయినప్పటికీ ఫలితంలో తేడా వచ్చింది. ప్రతి అభ్యర్థికి ఇరవై రెండు ఓట్లు కేటాయించినప్పటికీ  జయ మంగళం వెంకట రమణతో పాటు కోలా గురువులుకు  కేటాయించిన రెండు ఓట్లు తగ్గిపోయాయి. వారిద్దరికీ కేటాయించిన వారిలో ఒక్కొక్కరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేశారు. వారెవరు అన్నదానిపై వైఎస్ఆర్‌సీపీ అంతర్గతంగా పరిశీలన జరుపుకునే అవకాశం ఉంది. 


తెలుగుదేశం పార్టీ కూడా తమకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పలేదు. ఎవరెవరు తమతో టచ్‌లో ఉన్నారో కూడా బయటకు  రానీయలేదు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయింది. తమకు రికార్డుల్లో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆ ప్రకారం.. 23 ఓట్లు వచ్చాయని టీడీపీ సమర్థించుకోవడానికి అవకాశం దక్కింది. తమకు ఎవరూ క్రాస్ ఓటింగ్ చేయలేదని చెప్పుకునే అవకాశం కూడా లభించింది. ముందు నుంచీ విజయంపై ధీమాగా ఉన్నా టీడీపీ నేతలు ఎక్కడా హడావుడి చేయలేదు. ఓ ప్లాన్ ప్రకారం తమ పని తాము పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. 


ఈ ఫలితం వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు షాక్ లాంటిది. ఆయన ఏడు స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోన గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం జగన్ అసహనానికి గురయ్యారని.. ఈ సారి ఎలాంటి పొరపాటు జరిగినా ఊరుకునేది లేదని పార్టీ ముఖ్య నేతల్ని హెచ్చరించారంటున్నారు. అందుకే అత్యంత జాగ్రత్తగా క్యాంపులు ఏర్పాటు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు మథన పడుతున్నారు.