వసంత వసంత కృష్ణ ప్రసాద్, మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన వసంతకు ఇటీవల అన్ని వరుస తలనొప్పులు వస్తున్నాయి. నిన్నటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మంత్రి జోగి రమేష్‌తో వివాదం. దీంతో వసంత వసంత కృష్ణ ప్రసాద్ నిత్యం వార్తల్లోకి వచ్చారు. ఆ తరువాత ఆ వివాదం కాస్త సమసి పోయిందనుకుంటే ఇప్పుటికి కూడా ఆయనపై సోషల్ మీడియా వేదికగా వివాదాలు కమ్ముకుంటున్నాయి.


తాజాగా బందరు శాసన సభ్యుడు పేర్ని నానితో వసంత కృష్ణ ప్రసాద్ ఘర్షణ పడ్డారంటూ ట్రోల్స్ నడిచాయి. ఒక వైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరో వైపున ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నడుస్తున్నటైంలో ఈ ట్రోల్స్ రావడం సంచలనంగా మారింది. ఇరువురు నేతలు ఘర్షణ పడ్డారని, వాదనలతో మొదలైన వ్యవహరం బూతుల పురాణం వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.


ఆ ట్రోల్స్ దెబ్బకు ఈ విషయంపై ఎమ్మెల్యే పేర్నినాని, మైలవరం ఎమ్మెల్యే వసంత వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇద్దరు కలసి అసెంబ్లి మీడియా పాయింట్ వద్ద కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. తాము ఎటువంటి గొడవ పడలేదని, వస్తున్న ట్రోల్స్‌పై తమ దైన శైలిలో పంచ్‌లు వేశారు. కాస్త దూకుడుగానే బదులిచ్చారు. తామంతా ఒక్కటిగా వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉంటున్నందునే దుష్ర్పచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని పేర్నినాని, వసంత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.


వసంత- జోగి ఎపిసోడ్
ఇటీవల కాలంలో మంత్రి జోగి రమేష్ వ్యవహర శైలిపై వసంత వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోక్యం చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. సీఎం స్థాయిలో ఇరువురు నేతల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగినప్పటికి, ఆ తరువాత కూడా వసంత వసంత కృష్ణ ప్రసాద్ ఒకటి రెండు చోట్ల తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అందులో భాగంగానే ఇటీవల సొంత పార్టీలోని నేతలపై వసంత వసంత కృష్ణ ప్రసాద్ చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఈ వ్యవహరం తీవ్ర దుమారాన్నే రాజేసింది. 


సీఎం నుంచి మొదలై ఇప్పుడు పేర్ని నాని వరకు 


మైలవరం శాసన సభ్యుడు వసంత వసంత కృష్ణ ప్రసాద్‌పై ట్రోల్స్ ఇప్పుడేమి కొత్త కాదు. 2019 ఎన్నికల తరవాత నుంచి ఆయనపై ఇష్టానుసారంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగానే వసంత కృష్ణ ప్రసాద్‌పై ముఖ్యమంత్రి జగన్ చెయ్యి చేసుకున్నారని, వసంత కళ్ళ జోడు కూడా పగిలిపోయిదని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అలా ఇలా ట్రోల్ కాలేదు. చివరకు అప్పట్లోనే వసంత వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకొని అలాంటి సందర్భమే రాలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా జగన్ ఎపిసోడ్‌లో మొదలైన ట్రోల్స్ ఇప్పుడు పేర్నినాని వరకు వసంత కృష్ణ ప్రసాద్‌ను వెంటాడుతూనే ఉండగా ఆయన కూడా ఎప్పటికప్పడు వాటిపై క్లారిటి ఇస్తూనే ఉన్నారు.