Kethireddy Pedda Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి  రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. జేసీ బ్రదర్స్, కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా వినాయక మండపాల ఏర్పాటుపై ఇరు వర్గాలు మరోసారి ఆరోపణలకు దిగాయి. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారాయని తాడిపత్రి ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పాల్గొన్నారు. 


అందుకే డీఎస్పీపై ఆరోపణలు 


" ఏపీలో రాజన్న పాలన కొనసాగుతోంది. ప్రజలందరికీ విద్య, వైద్య అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్సార్. ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తాడిపత్రిలో 400 వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. జేసీ ప్రభాకర్ రెడ్డి పార్క్ వద్ద విగ్రహం ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడ మరొకరు విగ్రహం పెడతామని దరఖాస్తు చేసుకోవడంతో శాంతి భద్రత సమస్యలతో పోలీసులు తిరస్కరించారు. విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే జేసీ సోదరులు వారి ఇంటి వద్ద కానీ వారి బస్సుల షెడ్డు వద్ద గానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రజలు నిరంతరం వ్యాయామం చేసుకునే పార్క్ ముందర ఏర్పాటు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం. జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకు తాళాలు వేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల వద్ద పడికాపులు కాస్తున్నారు. బీఎస్ 3 వాహనాల రిజిస్ట్రేషన్ కేసు ఛార్జ్ షీట్ దశలో ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి డీఎస్పీపై ఆరోపణలు చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నంతవరకు తాడిపత్రిలో అందరూ చట్టం దృష్టిలో సమానులే."  - ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 


జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు 


వినాయక చవితి సందర్భంగా డీజే, రికార్డ్ డ్యాన్స్ కి ఎలా అనుమతించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తనకు అనుమతి ఇవ్వని పోలీసులు ఎమ్మెల్యే తనయుడు హాజరైన కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన ఓ ఘటనలో మున్సిపల్ ఉద్యోగి గాయపడ్డారు. ఈ ప్రమాదానికి డీఎస్పీ బాధ్యులని, అతనిపై కేసు నమోదు చేయాలన్నారు. డీఎస్పీ చైతన్య తాడిపత్రిలో పనికి రారన్నారు. అధికార పార్టీ నేతలకు అన్ని అనుమతులు ఇస్తున్నారన్నారు. తాడిపత్రిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎమ్మెల్యే, డీఎస్పీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు 250 విగ్రహాలు ఏర్పాటు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా తనపైనా ఆంక్షలు పెట్టారన్నారు. తనకు పోలీసులు అనుమతి ఇచ్చుంటే ప్రజలందరి కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే వాడినని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.


Also Read : BJP Vishnu : వైఎస్ఆర్‌సీపీపై బీజేపీ ప్రజాపోరు - ముందుండి నడిపించనున్న విష్ణువర్ధన్ రెడ్డి !


Also Read : Minister Pinipe Viswarup : మంత్రి పినిపే విశ్వరూప్ కు ఛాతీలో నొప్పి, రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు