BJP Vishnu : ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరిని ప్రశ్నిస్తూ ఈ యాత్రలు చేశారు. వీటిని బీజేపీ యువ నేత, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం అయ్యేలా చూశారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిర్వహించాలనుకుంటున్న ప్రజాపోరు సభలకు స్టేట్ ఇంచార్జిగా విష్ణువర్ధన్ రెడ్డికే బాధ్యతలు అప్పగించారు. 


విష్ణువర్ధన్ రెడ్డికి ఐదు వేల ప్రజాపోరు సభల బాధ్యత 


ఐదు వేల ప్రజాపోరు సభలు ఏర్పాటు చేయాలని.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  గత 8 సం.ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను గురించి, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలను గురించి ఆ సభల్లో చెప్పనున్నారు.  డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల,ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ సభల్లో తెలియచేసి.. ఏపీలోనూా బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేయాలని ఏపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.  హిరంగ సభలలో  కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు. 


ఏపీకి కేంద్రం చేసిన మేలును వివరించనున్న బీజేపీ నేతలు


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబుకు చాన్సిచ్చారు.. జగన్‌కూ ఇచ్చారు.. ఇప్పుడు మాకు ఓ చాన్సివ్వాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ప్రజలకు తాము ఏం చేశాం.. అధికిారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా వారికి వివరించగలిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయంగా సాధించవచ్చని బీజేపీ వ్యూహం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఐదు వేల సభలు విజయవంతం చేయడం అంటే ఆషామాషీ కాదు. ఉన్నది 175 నియోజకవర్గాలే. మండలానికి ఒకటి ఏర్పాటు చేసినా వెయ్యి లోపే ఉంటాయి. అంటే గ్రామాల వారీగా ఈ ప్రజాపోరు సభను ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. 


ఏపీలో యువ నాయకత్వం వైపు హైకమాండ్ చూపు 


ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల క్యాడర్‌తో  పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు ఉన్న విష్ణువర్దన్ రెడ్డి ఈ సభను విజయంతంగా నిర్వహిస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్ర కమటీకి ఇంచార్జ్‌గా ఆయన మంచి పనితీరు కనబరిస్తే జాతీయ నేతల దృష్టిలో పడే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేలా చూడాలని హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పగ్గాలు యువ నేతకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ సారి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మార్పులు జరిగితే యువతకే ప్రాధాన్యం ఇస్తారని.. అందులో విష్ణువర్ధన్ రెడ్డి ముందుంటారని భావిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తన సామర్త్యాన్ని నిరూపించుకోవడానికి ప్రజాపోరు సభలు ఉపయోగపడనున్నాయి.