తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు – నేడు పనులను గురించి, ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. సుమారు 45 వేల అంగన్‌వాడీలలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లలో  సదుపాయాలు.. కల్పించాల్సిన అంశాలు పై జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై  అధికారులు నిర్దిష్టమయిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి, నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో సమకూర్చుకోవాలని సీఎం తెలిపారు. 


పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చిన జగన్ 


ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని జగన్ తెలిపారు.పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలని జగన్ అన్నారు. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలని, ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపై కూడా పర్యవేక్షణ చేయాలని సూచించారు.


బయో మెడికల్ వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లు 


 రాష్ట్రంలో బయో మెడికల్ వేస్టేజీని అత్యంత కట్టుదిట్టమైన పద్దతుల్లో వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,68,255 బెడ్స్ తో 13,728 వైద్య సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం ఏటా 7197 టన్నుల బయో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలను సురక్షిత విధానంలో నాశనం చేసేందుకు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలిస్తున్నారని అన్నారు. ఇందు కోసం రాష్ట్ర  వ్యాప్తంగా 12 బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సంస్థల నుంచి వచ్చే బయో మెడికల్ వేస్టేజీని 48 గంటల్లో ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. బయో వేస్టేజీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలన్నారు. వైద్య సంస్థల సంఖ్య పెరగడం, అదనంగా బెడ్స్ ఏర్పాటు అవుతుండటం వల్ల రాష్ట్రంలో కొత్త బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని అర్హతలు ఉంటే కొత్త ప్లాంట్ ల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హానికరమైన వ్యర్థాలను సురక్షిత విధానాల్లో నాశనం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.