Chandrababu Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. పాత ఆర్డర్ ప్రకారం పండుగ సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది. అటు, ఫైబర్ నెట్ కేసులో (Fiber net case) ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సీఐడీని ఆదేశించింది. ఏపీ సీఐడీ (Ap cid) పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
17ఏ నిబంధన ఉన్నందున
సెక్షన్ 17ఏ నిబంధన ఫైబర్ నెట్ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, కేసు ముగిసేవరకూ అరెస్ట్ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు గత హామీ మేరకే ఉంటామని కోర్టుకు తెలిపారు. అయితే, కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించగా, సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున సగం విచారించిన జాబితా కిందకు తీసుకుంటున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఇదీ ఫైబర్ నెట్ కేసు
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొంటూ చంద్రబాబుపై అభియోగం మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారంటూ.. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ.. మొత్తం 19 మందిపై అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ, హైకోర్టులో కొట్టివేయగా.. ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
కీలకంగా క్వాష్ పిటిషన్ తీర్పు
స్కిల్ స్కాం కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తి కాగా, గత నెలలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ తీర్పు కీలకం కానుంది. క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అనుమతిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభిస్తుంది.
మరోవైపు, మద్యం స్కాంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పైనా విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈ నెల 15న చేపట్టనుంది. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్ర ఏ2గా ఉన్నారు.
Also Read: JNV Entrance Test: నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?