Three Capitals Supreme Court : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లతో పాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు, అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లను విడివిడిగానే విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ రెండు వేర్వేరు అంశాలని.. విడిగానే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వి, మాజీ ఏజీ వేణుగోపాల్ కోరారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారన్నారు. దీంతో విచారణను 28వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 


ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో అమరావతినే రాజధానిగా సమర్దిస్తూ కీలక తీర్పు ఇచ్చింది.  ఆరు నెలల పాటు ఈ తీర్పుపై సైలెంట్‌గా ఉన్న ఏపీ ప్రభుత్వం   సెప్టెంబర్ లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ఏపీ విభజన చట్టంపై గతంలో దాఖలైన పిటిషన్లను కూడా దీంతో కలిపి విచారణ జరపాలని  నిర్ణయం తీసుకుంది.  ఈ రెండు అంశాలపై ఇప్పటివరకు 35 కేసులు దాఖలయ్యాయి. రాజధాని కేసులతో పాటు విభజన కేసులన్నింటినీ విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  కానీ ప్రస్తుత ధర్మానం మళ్లీ విడివిడిగానే విచారణ జరపాలని నిర్ణయం తీసుకోవడంతో  విచారణలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 


ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చేనాటికి తమ ప్రభుత్వం  చట్టాలను రద్దు చేసిందని.. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధాని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్ లో పేర్కొన్నారు.   ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ.. చట్టానికి తప్పుడు అర్థాలు చెబుతున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదని ప్రభుత్వం వాదిస్తోంది. 


రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం, రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. రైతులు తమ  హక్కులు కాపాడాలని పిటిషన్ వేశారు.