మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గత రెండేళ్లుగా ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను 2020 మేలోనే హైకోర్టు కొట్టి వేసింది. ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.   విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  విధుల్లోకి మాత్రం తీసుకోలేదు. 


ఆయనపై ఏపీ ప్రభుత్వం పలు అభియోగాలతో చార్జిషీటు నమోదు చేసింది. కానీ ప్రచారం చేసిన దానికి .. చార్జిషీట్‌లో పేర్కొన్న అభియోగాలకు పొంతన లేదు. కేసులు ఎటూ తేలకపోవడంతో ఆయన స్పస్పెన్షన్‌లోనే ఉన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి గత ఫిబ్రవరికే రెండేళ్లు దాటిపోయింది. సివిల్ సర్వీస్ అధికారులను రెండేళ్లకు మించి సస్పెన్షన్‌లో ఉంచాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాలి. ఇప్పటి వరకూ ఈ విషయంలో కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగించడం సాధ్యం కాదని స్ఫష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టి వేసింది. 


తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్కన పెట్టారు. తొలి ఆరు నెలలు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత ఆయనపై పలు రకాల కేసులు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే పనిగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను ఏపీ వాడారాని చెబితే ఆ అంశంలోనూ ఆయనపై ఆరోపణలు చేశారు.  ఏబీవీ ప్రెస్ మీట్ పెట్టి తన వాదన వినపించారు. అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలకు విరుద్దమని.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. 


ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని గత ఏడాదే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోలేదు.  సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఆదేశించడంతో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయనను సర్వీసులోకి తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సుముఖత చూపే అవకాశం లేదని తెలుస్తోంది.