అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. నిజానికి అమరావతిలో అటు భూములు అమ్మిన వాళ్లు కానీ.. కొన్న వాళ్లు కానీ ఎవరూ ఫిర్యాదు చేయకుండానే... వైసీపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ తమంతట తాము ఊహించేసుకుని సీఐడీ, సిట్ విచారణలకు ఆదేశించింది. దానికి ఓ ఫిర్యాదును సాకుగా చూపింది. కానీ ఆ ఫిర్యాదు దారు అటు భూమి అమ్మిన వ్యక్తి కాదు.. ఇటు కొన్న వ్యక్తి కాదు. ధర్డ్ పార్టీ.  దీనిపై హైకోర్టు.. అసలు ఇన్ సైడర్ ట్రేడింగే లేదని తేల్చి చెప్పింది. రాజధాని ఎక్కడ వస్తుందో అందరికీ తెలిసినప్పుడు.. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా అంటారని ప్రశ్నించింది. విచారణను కొట్టి వేసింది. ఎంత వేగంగా హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టి వేసిందో అంతే వేగంగా ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడా అదే తీర్పు వచ్చింది. దీంతో  అమరావతిపై పడిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు  తప్పని రుజువయ్యాయి. 


అమరావతిని మార్చడానికి మూడు రాజధానులు చేయడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో  ప్రధానమైనది ఇన్ సైడర్ ట్రేడింగ్. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇక అమరావతిపై పడిన మచ్చలన్నీ చెరిగిపోయినట్లేనా..  అన్న ప్రశ్న ప్రభుత్వానికి సామాన్య జనం నుంచి వెళ్తోంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ప్రైమ్ ఆరోపణ. ఆ తర్వాత అమరావతి మునిగిపోతుందని అన్నారు. కానీ కృష్ణకు పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కరకట్ట దాటి చుక్క కూడా నీరు బయటకు రాలేదు. గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడే ఎడతెరిపి లేకుండా కురిసినా ఆ వరద ఎత్తిపోయడానికి ఎత్తిపోతల కూడా కట్టారు. దాంతో అదీ తేలిపోయింది. తర్వాత అక్కడ భారీ నిర్మాణాలు మన్నవు అని ఐఐటీ రిపోర్ట్ ఇచ్చిందని ప్రచారం చేశారు. కానీ ఇప్పటికే అక్కడ... ఇరవై అంతస్తుల భవనాలు ఠీవీగా నిలబడి ఉన్నాయి. ఇలా ప్రభుత్వం అమరావతిపై వేసిన అభాండాలన్నీ తేలిపోయాయి.  ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించడానికి ప్రభుత్వానికి ఒక్క కారణం కూడా లేదని నిపుణులు అంటున్నారు. 


అయితే అమరావతిపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రభుత్వం .. అధికార పార్టీ రాజకీయంగా చేసిన ప్రచారం.. అమరావతి ఓ సామాజికవర్గానికి చెందినదని. ఆ  భావన రాష్ట్ర వ్యాప్త ప్రజల మనసుల్లో నాటేందుకు ... తీవ్రంగా ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు. కానీ అమరావతి రాజధాని అంయితే.. ముందుగా దళితులు బాగుపడతారని.. ఆ తర్వాతే ఇతర వర్గాలని..  జనాభా లెక్కల సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. అందుకే దళితులు కూడా ఉద్యమంలో ఉన్నారు. కానీ..  ఓ సామాజికవర్గానికే రాజధాని అన్న భావన నుంచి ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. అలా బయటకు వచ్చిన రోజున..  అన్ని వైపుల నుంచి ప్రజలు రాజధాని కోసం.. పోరుబాటపడతారు.        


అమరావతి ప్రజారాజధాని..మా రాజధాని అని ప్రజలు అనుకున్న  రోజు రావాలంటే.. సుప్రీంకోర్టు తీర్పులు   ఉపయోగపడవు. ప్రజల అభిప్రాయాల్లో మార్పులు రావాలి. కులాలు.. మతాలు.. రాజకీయ పార్టీల భావాజాలలను మించి ఆలోచించాలి. అప్పుడు మాత్రం.. ప్రజలకు వాస్తవాలు కనిపిస్తాయి. అమరావతి.. ఆంధ్రుల భవిష్యత్‌కు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. తాము ఏం పోగొట్టుకుంటున్నామో గుర్తుకు వస్తుంది. ఆ మార్పు కోసం ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకూ అమరావతిపై మచ్చలు లేనట్లు కాదు.