ఏపీ సీఎం జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 


వీరికి నోటీసులు


విచారణ సందర్భంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, డ్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.


నత్తనడకన విచారణ


సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ప్రధాన నిందితుడు జగన్ కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీని వల్ల కేసు విచారణకు అంతు లేకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసు విచారణ ప్రారంభమయ్యే స్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి.' అని రఘురామ పిటిషన్ లో పేర్కొన్నారు.


ప్రభుత్వ పాలనపైనా పిటిషన్


అలాగే, ఏపీ ప్రభుత్వంపైనా ఎంపీ రఘురామకృష్ణం రాజు గురువారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై పూర్తిగా పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


రెబల్ ఎంపీగా


నిజానికి వైసీపీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి రెబల్ గా మారారు. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయన్న ఓసారి ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో రఘురామ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమయ్యారు. ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పార్టీ ఫిరాయించలేదు. ఈ కారణంగా వేటు పడలేదు. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. దీంతో అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. 


గతంలోనూ


సీఎం జగన్ పై గతంలోనూ ఎంపీ రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో నిందితులైన వారికి వివిధ పదవులు కట్టబెట్టడం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఇందుకు సాక్ష్యాలుగా కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ విచారణకు రావడం లేదు.


Also Read: టీడీపీ హయాంలో అప్పులపై నోరు మెదపరెందుకు పురందేశ్వరి? కాగ్ నివేదిక తప్పా? - మంత్రి బుగ్గన