Andhra Pradesh News : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై దాఖలైన పిటీషన్ పై ఈ నెల 24న విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరరపనుంది. ఏపీలో రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ జీవో 1 ను జారీ చేసింది జగన్ సర్కార్. అయితే జీవో 1 ను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సీపీఐ నేత రామకృష్ణ. ఆయన పిటీషన్ ను విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు ధన్మాసనం. అయితే తీర్పు జాప్యం అవుతున్న నేపధ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు పిటీషనర్లు.
తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయని ర్యాలీలు నిషేధించిన ఏపీ ప్రభుత్వం
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు - సుప్రీంకోర్టులో పిటిషన్
ఇలా జీవో జారీ చేసినప్పుడు సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సమయంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉందని సస్పెన్షన్ విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఏ నిర్ణయం వెలువరించలేదు. జీవో అమలుపై స్టే కొనసాగించడానికి నిరాకరించారు. కానీ తీర్పు మాత్రం రిజర్వ్‌లో ఉంది.
జీవో పేరు చెప్పి విపక్షాలను అణిచి వేస్తున్నారన్న నేతలు
జీవో నెంబర్ 1 అమలులో ఉన్నందువల్ల ప్రతిపక్షాలపై తీవ్రమైన అణిచివేతకు గురి చేస్తున్నారని అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారని వారికి ఎలాంటి నిబంధనలు పెట్టడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ జీవో వల్ల విపక్షాలకు మాత్రమే ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు.