YS Viveka Murder Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులకు కల్పిస్తున్న భద్రతపై సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పిన విధంగా 1 + 1 భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తును ఏపీలో కాకుండా మరే ఇతర ప్రాంతంలో చేపట్టాలని వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు అటు సీబీఐ,  ఇటు ఏపీ ప్రభుత్వం కూడా సమయం కోరారాయి. ఒకటి,రెండు రోజులు సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ కోరారు.


అవసరమైతే సాక్షులకు మరింత భద్రత కల్పిస్తామన్న ఏపీ ప్రభుత్వం 


విచారణ సందర్భంగా సాక్షుల భద్రత అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు  వన్ ప్లస్ వన్‌ భద్రత కల్పిస్తున్నామని అవసరం అయితే ఇంకా పెంచుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అయితే  సర్కార్ ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదని తెలుస్తోందని ధర్మానసం వ్యాఖ్యానించారు. ఇదే కేసులో  ఏ5 శివశంకర్ రెడ్డి తమ వాదన కూడా వినాలని కోరారు. ఈ నెల 19న పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.అనంతరం తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ముందుకు సాగడం లేదని.. ప్రభుత్వం నేరస్తులకు అండగా ఉంటూ సీబీఐకి సహకరించకపోతూండటంతో ఆలస్యం అవుతుందని..విచారణను ఇతర రాష్ట్రాలకు్ మార్చాలని సునీత కోరుతున్నారు. 


ప్రాణభయం ఉందని ఆందోళన చెందుతున్న అప్రూవర్ దస్తగిరి 


వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉందని రెండు రోజులుగా మీడయా ముందుకు వచ్చి చెబుతున్నారు. తన కుక్కను చంపేశారని గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి పోతున్నారని ఆయన చెబుతున్నారు. తన ప్రాణానికి ఏం జరిగినా..  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యతంటున్నారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో  సాక్షుల భద్రతపై సాక్షాత్తూ సుప్రీంకోర్టే సందేహం వ్యక్తం చేయడం సంచలనంగా మారంది. 


గతంలో నిందితులకు పలు విషయాల్లో  సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు


మరో వైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న  దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు తమ సహ నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కొట్టి వేసింది. మొదట వారు హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు వారి బెయిల్ పిటిషన్ల విషయంలోనూ ఎదురు దెబ్బలు తగిలాయి. మొత్తం వివేకా హత్య కేసును విచారణను ఇతర రాష్ట్రాలకు తరలింపుపై  సునీత పిటిషన్ విచారణపై ఎలాంటి తీర్పు వచ్చినా కీలక మలుపు అవడం ఖాయంగా కనిపిస్తోంది.