Indian Student Attacked In Sydney:
సిడ్నీలో ఘటన..
విదేశాల్లో భారతీయులపై ద్వేషపూరిత దాడులు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఓ భారత విద్యార్థిపై గత వారం దారుణంగా దాడి జరిగింది. ఓ దుండగుడు శుభం గర్గ్‌పై కత్తితో దాడి చేసి 11 సార్లు పొడిచాడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న శుభం గర్గ్‌పై అక్టోబర్ 6వ తేదీన ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో నివసించే బాధితుడి కుటుంబ సభ్యులు...ఆస్ట్రేలియాకు వచ్చేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సాయం చేయాలని అర్థిస్తున్నారు. IIT మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక...ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్టోబర్ 6వ తేదీన రాత్రి 10.30 గంటలకు ATMకి వెళ్లి క్యాష్ డ్రా చేసుకున్నాడు శుభం గర్గ్. దారి మధ్యలో ఓ దుండగుడు అడ్డగించాడు. డబ్బులివ్వాలని కత్తితో బెదిరించాడు. డబ్బిచ్చేందుకు గర్గ్ నిరాకరించగా...కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు. బాధితుడికి మొహం, ఛాతి, పొత్తికడుపుపై తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ఆ గాయాలతోనే ఏదో విధంగా సమీపంలోని ఓ ఇంటికి వెళ్లగా...వాళ్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. "శుభం ఎలాగోలా బతికాడు. అక్టోబర్ 8వ తేదీన మేము ఎన్ని సార్లు కాల్ చేసినా అటెండ్ చేయలేదు. అప్పుడే వాడి స్నేహితుడికి కాల్ చేశాం" అని బాధితుడి తండ్రి రామ్‌నివాస్ గర్గ్ చెప్పారు. "11 గంటల పాటు పొత్తికడుపు సర్జరీ చేశారు. వాడి వైద్యానికి అవసరమయ్యే ఖర్చుని భరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మా చిన్న కొడుకుకి వీసా ఇవ్వండి" అని విజ్ఞప్తి చేశారు.
సాయం కోసం..
ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రేసిస్ట్ అటాక్ అనటానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు చెప్పారు. శుభం గర్గ్ కుటుంబ సభ్యులు తమకు సాయం చేయమని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. బాధితుడి సోదరి కావ్య గర్గ్ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లు చేసింది. భాజపా ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ ఇంటికి కూడా వెళ్లింది బాధితుడి కుటుంబం. సిడ్నీలోని ఇండియన్ కాన్సులేట్ అన్ని విధాల సహకరిస్తోందని ఆస్ట్రేలియన్ హై కమిషన్ వెల్లడించింది.