స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. 


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.


నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టులో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, సిద్ధార్థ లుథ్రా, హరీశ్‌ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని అన్నారు. ఆరోపణలు ఎప్పుడు వచ్చాయనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేది చర్చించాలని హరీశ్ సాల్వే వాదించారు.


వాదనలు కొనసాగించాలని కోరిన న్యాయవాదులు
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా వేయడంతో వాదనలు కొనసాగించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తులను కోరారు. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉన్నారని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని న్యాయమూర్తుల ముందు ప్రస్తావించారు. 


సెక్షన్ 17ఏ అంటే..?
పబ్లిక్ సర్వెంట్స్ ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు పోలీసులు తామంతతాముగా వారిని విచారణ లేదా దర్యాప్తు చేయకుండా ఉండేందుకు సెక్షన్ 17ఏ వీలు కల్పిస్తుంది. ఆయన పై అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా సేవకుడ్ని అరెస్టు లేదా విచారణ చేసే వీలు ఉంటుంది. అధికారంతో రాజకీయ ప్రతీకారం తీర్చుకొనే అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్ 17ఏ ను తీసుకొచ్చారు.


అభిషేక్ సింఘ్వి వాదనలు ఇవీ
చంద్రబాబు తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. కేబినెట్ నిర్ణయాలంటే అధికార నిర్వహణలో భాగమని అన్నారు. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు రాజకీయ ప్రతీకార చర్యల నుంచి సెక్షన్ 17ఏ అనేది రక్షణ కల్పిస్తుందని అన్నారు. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుందని వాదించారు. ‘‘ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుంది. 2015 నుంచి 2019 వరకూ జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయి. 17ఏ చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారు. 2018లో చట్ట సవరణ జరిగితే 2019లో జరిగిన నిర్ణయాలను కేసు పరిధిలోకి తీసుకురాలేరు’’ అని వాదించారు.


సీఐడీ వాదనలు ఇవీ
ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘‘2018 జులైలో చట్ట సవరణ వచ్చింది. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2017లోనే కేసు మూలాలు ఉన్నందున.. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తించదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే, ముందే విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. 10 శాతం ప్రభుత్వ సంస్థ, 90 శాతం ప్రైవేటు సంస్థ పేరుతో వందల కోట్లు దుర్వినియోగం జరిగిందని ముకుల్ రోహత్గీ వాదించారు. కేసు మెరిట్స్ పై చర్చ జరగట్లేదు.. కేసు వివరాల్లోకి వెళ్లవద్దని రోహత్గీ జస్టిస్ బోస్‌కు సూచించారు. కేసు వివరాలకు వెళ్లకుండానే హైకోర్టు క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిందని రోహత్గీ అన్నారు. ఈ కేసులో పిటిషనర్ కౌంటర్ కూడా వేయలేదని అన్నారు. అయితే, కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించామని సిద్ధార్థ లుత్రా చెప్పారు. ధర్మాసనం అడిగిన డాక్యుమెంట్లు సమర్పించేందుకు సమయం కావాలని రోహత్గీ కోరగా, కేసు వివరాలతో మొత్తం తాము సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ లుథ్రా చెప్పారు.