ఏషియా గేమ్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా భారత పురుషుల క్రికెట్ జట్టు తొలి అడుగు ఘనంగా వేసింది. నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 202 పరుగులు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రికార్డు సెంచరీ సాధించాడు. 49 బాల్స్ లోనే ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టాప్ ఆర్డర్ లో జైస్వాల్ తప్ప మిగతా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పవర్ ప్లే తర్వాత వికెట్ కాస్త స్లో అవటంతో షాట్లు ఆడటానికి బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు.


కానీ చివర్లో యువ సంచలనం రింకూ సింగ్ తో పాటు శివం దూబే భారీ షాట్లు ఆడారు. రింకూ అయితే 15 బాల్స్ లోనే 37 స్కోర్ చేశాడు. చేజింగ్ కు దిగిన నేపాల్, నిర్ణీత 20 ఓవర్లలో 179 స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ లో పలువురు బ్యాటర్లు ఆడిన షాట్లు ఆకట్టుకున్నాయి. కాస్త ప్లానింగ్ తో ఆడి ఉంటే టార్గెట్ కు మరింత దగ్గరగా వచ్చేవాళ్లే. భారత స్పిన్నర్లు రవి బిష్ణోయ్ మరియు సాయి కిషోర్ బౌలింగ్ లో నేపాల్ ఇబ్బందిపడింది కానీ పేసర్లను చాలా బాగా హ్యాండిల్ చేసింది. అవేష్ ఖాన్ మరియు రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీశారు. మరో క్వార్టర్ ఫైనల్ లో వచ్చే ఫలితం ఆధారంగా అక్టోబర్ 6వ తేదీన భారత్ ఆడబోయే సెమీఫైనల్ లో ప్రత్యర్థి ఎవరో తెలుస్తుంది.