YS Viveka Case :  వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు  సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు అవినాశ్ రెడ్డికి స్పష్టం చేసింది. మరో వైపు  వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ తరుపు న్యాయవాది చెప్పారని.. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.  ఈ రోజు కోర్టులో వివేకా కూతురు సునీత తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అవినాష్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందున అవినాష్ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని సునీత తరపు లాయర్ మెమో వేశారు.
     
రహస్య సాక్షి గురించి కోర్టుకు సమాచారం ఇచ్చిన సీబీఐ                      


 కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సీబీఐ సంచలన విషయాన్ని కోర్టు ముందు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో వాదనల సందర్భంగా.. తమ వద్ద ‘ రహస్య సాక్షి ’ వాంగ్మూలం ఉందని సీబీఐ  తెలిపింది.  ఈ రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉందని బట్టబయలైందని సీబీఐ పేర్కొంది. హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే ఇతర కోణాలు లేవనే వాదనకు ఈ స్టేట్‌మెంట్‌తో తిరుగులేని బలం చేకూరిందని సీబీఐ వాదించింది. 
భద్రత దృష్ట్యా ఈ సాక్షి పేరు ఇప్పుడు వెల్లడించలేమని.. త్వరలో సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఈ వాంగ్మూలాన్ని వెల్లడిస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అంతగా కావాలంటే సీల్డ్‌ కవర్‌లో స్టేట్‌మెంట్‌ సమర్పిస్తామని, అయితే ఈ విషయం అత్యంత రహస్యం అయినందు అవినాశ్‌రెడ్డి న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియరాదని పేర్కొన్నారు. గతంలోనూ సాక్షుల పేర్లు వెల్లడించిన తర్వాత వారు మారిపోవడమో.. చనిపోవడమో జరిగిందని పేర్కొన్నారు. హైకోర్టుకు కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది.


సునీత మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తారా ?           


మరో వైపు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సీబీఐ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అదే సమయంలో  వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం  సుప్రీంకోర్టుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గంగిరెడ్డి బెయిల్ విషయంలో ఆమెసుప్రీంకోర్టులో పోరాడి బెయిల్ రద్దు చేయించారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పిటిషన్ల విషయంలో హైకోర్టు స్పందించిన తీరుపై రెండు సార్లు సుప్రీంకోర్టు అసహనం  వ్యక్తం చేసింది.   కారణం ఏదైనా.. సుప్రీంకోర్టుకు సీబీఐనో.. సునీత రెడ్డినో పిటిషన్ వేసి.. విచారణ పూర్తయ్యే వరకూ.. అవినాష్ రెడ్డికి  ఊరటే.. ఆయన బెయిల్ పై ఉండొచ్చు.