Students And Farmers Trapped In Peddavagu River In Vijayawada: ఎన్టీఆర్ జిల్లా (NTR District) విజయవాడ (Vijayawada) శివారు నున్న సమీపంలోని పెద్దవాగు భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తోంది. వికాస్ కాలేజీ (Vikas College) రోడ్డులోని వాగు పొంగడంతో రహదారిపై 10 అడుగుల మేర నీరు చేరి ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 100 మంది కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు వరదలో దాదాపు 2 గంటల పాటు చిక్కుకుపోయారు. దీంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా వికాస్ కాలేజీ వైపు నుంచి నున్న వైపు రావాల్సి ఉంది.
హోంమంత్రి ఆరా
మరోవైపు, ఈ ఘటనపై పెద్దవాగు పొంగిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రైతులు, విద్యార్థులు చిక్కుకున్నారన్న వార్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ సృజనతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం పెద్దవాగు సాధారణ స్థితికి చేరిందని సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని కలెక్టర్.. హోంమంత్రికి తెలిపారు. వికాస్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ రాత్రికి వాగును దాటకుండా హాస్టల్‌లోనే గడిపేలా ముందు జాగ్రత చర్యలు చేపట్టారు. సాహసం చేసి వాగు దాటే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చూసుకునేలా హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు.