Pawan Kalyan Responds On Karthi Tweet: తిరుమల లడ్డూ వివాదంపై నటుడు కార్తీ (Actor Karthi) స్పందించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కార్తి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పగా.. తాజాగా పవన్ ఆయన ట్వీట్‌పై స్పందించారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ కార్తి స్పందించిన తీరు సంతోషకరమని అన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అంశం పవిత్ర సంస్థలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల లోతైన భావోద్వేగాన్ని కలిగి ఉంటాయని అన్నారు. అలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ అవసరమని ట్వీట్‌లో పేర్కొన్నారు. 


ట్వీట్‌లో ఏం చెప్పారంటే.?






'డియర్ కార్తీ గారూ.. మన సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి, తిరుమల గౌరవప్రదమైన లడ్డూల వంటి మన పవిత్ర సంస్థలకు సంబంధించిన విషయాల లక్షలాది మంది భక్తుల లోతైన భావోద్వేగాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే, పరిస్థితి అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలపై గౌరవాన్ని పెంపొందించడం ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత. సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం, ప్రతిభ మన సినిమాని నిలకడగా సుసంపన్నం చేసిన గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను.' అని ట్వీట్‌లో పవన్ పేర్కొన్నారు. అలాగే, సూర్య, జ్యోతిక నిర్మిస్తోన్న కార్తీ కొత్త చిత్రం 'సత్యం సుందరం' విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.


ఇదీ జరిగింది


తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం హాట్ టాపిక్‌గా మారిన వేళ.. తమిళ హీరో కార్తీ తన కొత్త సినిమా 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ టాపిక్ వచ్చినప్పుడు 'అది సెన్సిటివ్ ఇష్యూ' అని అన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతమంది లడ్డూ 'సెన్సిటివ్ ఇష్యూ' అంటూ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై నటుడు కార్తీ స్పందించారు. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని, ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. 'డియర్ పవన్ కల్యాణ్ సర్.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నాను. నేను శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తుడిని. మన సంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను' అని ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు.


Also Read: YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా