ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీసాధన సమితిగా ఏర్పడి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని నోటీసులో పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో కొంత కాలంగా తాము వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అందులో చేర్చారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సీఎస్‌కు నోటీసు ఇవ్వాలనుకున్నారు. అయితే సీఎస్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు కేంద్రం వద్ద సమావేశం ఉండటంతో ఢిల్లీ వెళ్లారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. 


Also Read: నచ్చ చెప్పేందుకు మంగళవారం కూడా ప్రయత్నం.. ఉద్యోగులు రావాలన్న ప్రభుత్వ కమిటీ !


ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో ఉద్యోగు సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘం నేతలు.. ప్రభుత్వం నమ్మించి మోసం చేయడం వల్లనే సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 


Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !


తాము సమ్మెకు వెళ్లాలని అనుకోలేదని.. కానీ చర్చల ప్రక్రియ తర్వాత పీఆర్సీ ప్రకటించామని చెబుతున్న ప్రభుత్వం ఆ ప్రక్రియలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.  ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఉద్యోగ నేతలు విమర్శించారు. తాము ఆషామాషీగా సమ్మె చేయడం లేదని.. ఉద్యోగుల సమ్మె తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే నెల పాత జీతాలే ఇవ్వాలన్నారు. 


Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?


ఇప్పటికీ కూడా ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయనే తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తోందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించారు. రేపు ర్యాలీలు ధర్నాలు చేయనున్నారు. ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇవ్డం.. ప్రభుత్వం జీవోలను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి