విద్యా, గృహ నిర్మాణ రంగాలకు సంబందించిన రుణాల విడుదలలో బ్యాంకుల పాత్ర పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో నిర్దేశించిన రుణ లక్ష్యాలను చేరుకోవటంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎస్ఎల్ బీసీ సమావేశం...
సీఎం వైఎస్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ( SLBC Meeting) శుక్రవారం జరిగింది. గత ఏడాది ఎంత మేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నామన్న అంశంపై ఎస్‌ఎల్బీసీలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువ రుణాలు ఇచ్చామని అదికారులు సీఎంకు వెల్లడించారు. ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు కాగా, ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు అని, దీంతో 99.47శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా, 1,72,225 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ. 53,149 కోట్లు ఇచ్చామని, అదే విదంగా ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ. 1,63,903 కోట్లు ఇచ్చామని అధికారులు తమ నివేదిక లో సీఎం జగన్ కు వివరించారు. 
అధికారుల నివేదికపై సీఎం జగన్ సమీక్ష...
రుణాల మంజూరు విషయంలో అధికారులు ఇచ్చిన నివేదిక పై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. విద్య, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయని జగన్ అన్నారు. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని, ఆయన తెలిపారు.. సామాజిక – ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ అదికారులు ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇళ్ల పట్టాలు పంపిణిపై చర్చ..
30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ప్రభుత్వమే ఇళ్ల స్ధలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసిందని, ఏప్రిల్‌ నెలలో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నామని చెప్పారు. మెత్తం 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని, సిమెంటు, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోందని గుర్తు చేశారు. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు రూ.35 వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించిన విషయాలను జగన్ వివరించారు. ప్రభుత్వమే ఈ రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లిస్తుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే స్టీల్, సిమెంటు వినియోగం వల్ల గ్రామీణ ఆర్ధిక రంగం అభివృద్ధికి గణనీయమైన ఊతమిస్తుందని, మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుందని, ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్‌ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుందని చెప్పారు.. ఈ క్రమంలో గృహనిర్మాణ రంగంలో బ్యాంకులు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉందని జగన్ అదికారులకు సూచించారు.
వ్యవసాయం రంగంపై..
ఇక వ్యవసాయ రంగం విషయానికొస్తే స్వల్పకాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చూస్తే కేవలం 83.36 శాతం మాత్రమే చేరుకున్నామని, దీనికి సంబంధించిన కారణాలపై దృష్టి పెట్టి ఎస్‌ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.