Srisailam Reservoir News: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తారు. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రిష్ణా నదిపై ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, సుంకేసుల డ్యాం నుంచి అధికంగా వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో జలవనరుల అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తెరిచారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 179.89 టీఎంసీల నిల్వ ఉంది.


ప్రస్తుతం శ్రీశైలానికి 4,69,536 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,29,058 క్యూసెక్కుల వరద వస్తోంది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,478 క్యూసెక్కుల వరద వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ డ్యాం గేట్ల నుంచి 78,056 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. 


మరోవైపు, ఏపీకి చెందిన కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,141 క్యూసెక్కులను, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇంకా శ్రీశైలం వెనుక జలాల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులను, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.