Srisailam Brahmotsavalu : శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు, ఆలయ ఛైర్మన్, సభ్యులు ఘనంగా ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 13 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి స్వామి, అమ్మ వారి దర్శించుకున్నారని అంచనా వేశామన్నారు. అలానే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని, నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి, అమ్మ వారిని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివాం నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో లవన్న తెలిపారు. 


నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 


నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం సాయంత్రం 5 : 30 గంటలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన పూజలు అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపట ఆవిష్కరణ చేశారు.  రేపటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైలం క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.


 శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పణ


 శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఈవో విజయసాగర్ బాబు దంపతులు, ఛైర్మన్ శ్రీనివాసులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న, ఛైర్మన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో విజయసాగర్ బాబు, అర్చకులు, అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు. అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో లవన్నకు ఛైర్మన్ కు శ్రీకాళహస్తి ఈవో విజయసాగర్ బాబు శేష వస్త్రాలతో సత్కరించారు. 


18న శివరాత్రి


ఈ ఏడాది ఫిబ్రవరి 18, శనివారం రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. ప్రతి నెలలోని కృష్ణపక్ష త్రయోదశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. సంవత్సరంలోని చివరి మాసమైన ఫల్గుణ మాసం కృష్ణ పక్ష త్రయోదశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివ భక్తులు ప్రతి మాస శివరాత్రి రోజున కూడా ప్రత్యేక శివారాధన చెయ్యడం నియమానుసారం ఆరోజు గడపడం చేస్తుంటారు. కానీ మహా శివరాత్రి మాత్రం హిందువులంతా కూడా జరుపుకుంటారు. ఈ రోజున శివారాధన చేసిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ప్రతీతి. శివపురాణాన్ని అనుసరించి ఈరోజున శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు.