India vs Australia Nagpur Test: భారత క్రికెట్ జట్టు గత కొన్నేళ్లుగా టెస్ట్ ఫార్మాట్‌లో యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దీని శాంపిల్‌ను ఈరోజు ఆస్ట్రేలియాకు చూపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్ సందర్భంగా జరిగిన నాగ్‌పూర్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు అందించారు.


అద్భుతాలు చేసిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
భారత ఇన్నింగ్స్‌లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్థాయిలో పరుగులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో చాలాసార్లు భారత్ లోయర్ ఆర్డర్ చాలా పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ భాగస్వామ్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్‌లోనూ అదే కనిపించింది.


ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసి 400 పరుగులు చేసింది. ఈ 400 పరుగులలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 190 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 191 పరుగులు చేశారు. ఎవరెవరు ఎంతెంత స్కోరు చేశారో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.


ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 120 పరుగుల సెంచరీ సాధించాడు, ఇది ఈ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా. తనతో పాటు కేఎల్ రాహుల్ 20, ఛతేశ్వర్ పుజారా 7, విరాట్ కోహ్లీ 12, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేశారు. ఈ బ్యాట్స్‌మెన్ అంతా కలిసి 167 పరుగులు చేశారు. అదే సమయంలో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ 23 పరుగులు కలిపినా కూడా భారత టాప్, మిడిల్ బ్యాటింగ్ ఆర్డర్ 190 పరుగులు మాత్రమే జోడించగలిగింది.


అదే సమయంలో లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీల పరుగులు మాత్రమే కలిస్తే 191 పరుగులు ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టాప్ 6 బ్యాట్స్‌మెన్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇందులో రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84, మహ్మద్ షమీ 37 పరుగులు చేశారు.


ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో విజయం సాధించడంలో భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించారని ఈ గణాంకాలను బట్టి ఒక విషయం స్పష్టమైంది. అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఢిల్లీ టెస్టులో ఎక్కువ పరుగులు చేస్తారని భావిస్తున్నారు.


బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాగ్‌పూర్‌లో టీమిండియా సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఇన్నింగ్స్ పరంగా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం.


ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకం. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకు ఆలౌటైంది.