Nizambad News : చేయని నేరానికి 14 ఏళ్లు జైలు జీవితం గడిపాడు తెలంగాణ యువకుడు. ఓ వ్యక్తి మృతి కేసులో అరెస్టుగా దుబాయ్ కోర్టు యువకుడికి మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబం క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో యువకుడిని జైలు నుంచి రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన మాకురి శంకర్‌ 2006లో ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిలో చేరాడు.  శంకర్ దుబాయ్‌కు వెళ్లే సమయంలో అతడి భార్య గర్భిణీ. కొన్ని రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు. 2009లో శంకర్ స్వగ్రామానికి తిరిగి రావాల్సి ఉన్నా అనుకోని ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. శంకర్ పనిచేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన దుబాయ్ పోలీసులు ఆ వ్యక్తి మరణించడానికి శంకర్‌ కారణమని అరెస్టు చేశారు.  అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అతడు ప్రమాదవశాత్తు జారిపడిపోయాడని శంకర్ ఎంతగా ప్రాధేయపడినా స్థానిక కోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో విచారించిన దుబాయ్ కోర్టు 2013లో శంకర్‌కు మరణశిక్ష విధించింది. మరణశిక్షపై పునఃపరిశీలన చేయాలని శంకర్ కోర్టును అప్పీలు చేయగా తిరిగి విచారణ ప్రారంభం అయింది.  


క్షమాభిక్షతో స్వదేశానికి 


అయితే శంకర్ కు కోర్టు ఒక అవకాశం ఇచ్చింది. మరణశిక్ష కొట్టివేయాలంటే మృతుని కుటుంబం నుంచి క్షమాభిక్ష అనుమతి తీసుకురావాలని కోర్టు సూచించారు. దీంతో శంకర్‌ కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత దేగాం యాదాగౌడ్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఆయన దుబాయ్‌లోని న్యాయవాదిని కాంటాక్ట్ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయింది రాజస్థాన్‌ యువకుడు అని తెలుసుకున్న శంకర్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి, రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మృతుని కుటంబ సభ్యులు క్షమాభిక్షకు ఒప్పుకున్నారు. అయితే ఆ పరిహారాన్ని శంకర్ కుటుంబ సభ్యులు విరాళాల రూపంలో వసూలు చేసి మృతుని కుుటుంబానికి అందించారు. దీంతో బాధిత యువకుడి కుటుంబం క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేయటంతో వాటిని దుబాయ్‌ కోర్టుకు సమర్పించారు. దీంతో అక్కడి కోర్టు శంకర్‌కు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించింది. వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శంకర్ స్వగ్రామం చేరుకున్నారు.  దాదాపు 17 ఏళ్ల తర్వాత శంకర్ ఇంటికి చేరుకున్నాడు. 


పెళ్లిలో పోలీసుల ఎంట్రీ, పెళ్లి కొడుకు తండ్రి అరెస్టు


హైదరాబాద్ నాగోల్ జరిగిన పెళ్లిలో గురువారం అర్ధరాత్రి పోలీసుల హంగామా చేశారు. పెళ్లికొడుకు తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో నిందితుడు కొడుకు పెళ్లిలో ప్రత్యక్షం అవ్వడంతో కాపుకాసిన మేడ్చల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. శుభం ఫంక్షన్ హాల్లో తెల్లవారుజామున పెళ్లి కొడుకు తండ్రి  శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఒక కేసులో శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.  ఒకవైపు పెళ్లి జరుగుతుండగా తండ్రిని అరెస్టు చేయడంతో పెళ్లిలో గందరగోళం నెలకొంది. 


అసలేం జరిగింది? 


 మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్థుడిని సినీఫక్కీలో పోలీసులు అరెస్టు చేశారు. కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్టేషన్ లో 7 కేసులు, అల్వాల్ లో 7 కేసులు, జవహర్ నగర్ లో ఓ కేసు నమోదై ఉన్నట్లు మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో పోలీసులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నగర శివారు నాగోల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో శ్రీనివాస్ కుమారుడి పెళ్లి జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అదును చూసి అర్ధరాత్రి సమయంలో కుతాడి శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుతాడి శ్రీనివాస్ గతంలో అనేక చోట్ల భూదందాలు చేసి కొనుగోలుదారులను మోసం చేయడం, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకకుండా దిల్లీ, దుబాయ్ లలో తలదాచుకున్న శ్రీనివాస్ ... కొడుకు పెండ్లి కోసం హైదరాబాద్  వచ్చినట్లు తెలిసి కాపుకాసి అరెస్టు చేశామన్నారు పోలీసులు.