Turkey Earthquake:


నరకం అనుభవించి..


టర్కీ సిరియాలో ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి. వాటి కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొందరు రోజుల పాటు ఆ శిథిలాల కిందే నలిగిపోతున్నారు. క్రమంగా ఒక్కొక్కరినీ వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 94 గంటల పాటు ఇలా శిథిలాల కిందే చిక్కుకున్న ఓ 17 ఏళ్ల కుర్రాడిని బయటకు తీశారు. తను ఎంత నరకం అనుభవించాడో చెప్పాడు. ఆ కథే అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ఆశ్చర్యానికీ గురి చేస్తోంది. దాహం వేసి తన మూత్రాన్ని తాగే తాగినట్టు వివరించాడు ఆ బాధితుడు. అంతే కాదు. ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఉన్న పూలు తిన్నట్టు చెప్పాడు. నిద్రలో ఉండగా ఉన్నట్టుండి భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయిందని తెలిపాడు. 




"దాహం వేసి తట్టుకోలేక నా యూరిన్ నేనే తాగాను. బాగా ఆకలి వేసింది. ఇంట్లో ఉన్న పూలను తినేశాను. నిద్ర పట్టకుండా ప్రతి 25 నిముషాలకోసారి అలారం పెట్టుకున్నాను. రెండ్రోజుల వరకూ ఇలా చేశాను.  ఆ తరవాత నా ఫోన్‌లో బ్యాటరీ అయిపోయి స్విచ్ఛాఫ అయింది. నాకు బయట చాలా మంది అరుపులు వినిపించాయి. కానీ నా కేకలు బయటకు వినిపిస్తాయో లేదో అని కంగారు పడ్డాను. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతుండగానే నేను చనిపోతానేమో అని భయపడ్డాను. మొత్తానికి నాలుగు రోజుల తరవాత సేఫ్‌గా బయటకొచ్చాను. నన్ను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు" 


-బాధితుడు 


ప్రస్తుతానికి టర్కీ సిరియాలో మృతుల సంఖ్య 24 వేలకు చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నప్పటికీ కొందరు శిథిలాల కిందే చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నారు. ఎన్నో గంటల పాటు శ్రమించి ఓ పదేళ్ల బాలుడితో పాటు తల్లినీ కాపాడింది సిబ్బంది.