Turkey Tragedy:


డాగ్‌స్క్వాడ్ 


టర్కీ సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 24 వేలు దాటింది. ఇంకా శిథిలాల కింద ఎంత మంది నలిగిపోయారో లెక్క తేలడం లేదు. విపరీతమైన చలిలోనూ రెస్య్కూ ఆపరేషన్ జరుగుతోంది. ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రపంచ దేశాలూ టర్కీ సిరియాకు సహకారం అందించేందుకు సహాయక బృందాలను పంపుతున్నాయి. భారత్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్న ఇండియా...NDRF బృందాలనూ అక్కడికి పంపించి బాధితులకు అండగా నిలబడుతోంది. ఈ క్రమంలోనే ఓ డాగ్‌స్క్వాడ్‌నూ పంపింది. ఈ స్క్వాడ్‌లో మొత్తం నాలుగు శునకాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. వాటి పేర్లు రోమియో, జూలీ, హనీ, రాంబో. రెండు NDRF బృందాలతో పాటు ఈ డాగ్ స్వ్కాడ్‌ కూడా టర్కీకి చేరుకుంది. ఇలాంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద వారిని గుర్తించి NDRF బృందాలకు సాయ పడుతుంటాయి ఈ శునకాలు. NDRF కమాండర్ గురుమీందర్ సింగ్‌ ఈ స్క్వాడ్‌ గురించి మరి కొన్ని వివరాలు అందించారు. సహాయక చర్యల్లో శునకాలు ఎంతో సహకరిస్తున్నట్టు చెప్పారు. జూలీ అనే శునకం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించిందని, వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. భారత్‌తో పాటు మరి కొన్ని దేశాలూ డాగ్‌ స్క్వాడ్‌లను టర్కీకి పంపాయి.