Case On Rana Suresh Babu :హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఓ స్థలం వివాదంలో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయింది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారని   ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు తమను బెదిరించారని ఆరోపించారు.  ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.  దీంతో నిర్మాత సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు రావాలని సురేష్ బాబు, రానాకు సమన్లు జారీ చేసింది.  


అసలేంటి వివాదం?


 ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుమారుడు హీరో రానాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేష్ బాబు తమను మోసం చేశారని కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తమ వద్ద డబ్బు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో వ్యాపారి నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో కోర్టు సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసు వివరాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.  


రూ.5 కోట్లు తీసుకుని 


షేక్‌పేట మండలం సర్వే నం.403  ఫిలింనగర్‌ రోడ్‌ నంబర్ 1లో సినీ నటి మాధవికి చెందిన ప్లాట్‌ 2లో ఉన్న 1007 గజాలను సురేష్ బాబు కొనుగోలు చేశారు.  దాని పక్కనే హీరో వెంకటేష్ కు చెందిన ప్లాట్‌ నం.3లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని సురేష్ బాబు కుటుంబం 2014లో హోటల్‌ ఏర్పాటు కోసం ప్రమోద్‌ కుమార్ కు లీజుకిచ్చింది. 2018 ఫిబ్రవరిలో లీజు ముగియడంతో ప్లాట్ నెం.2లోని  స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు ఒప్పుకోవడంతో రూ.5 కోట్లు చెల్లించిన  ప్రమోద్‌, ఇతరులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదని ప్రమోద్‌పై సురేష్ బాబు కేసు వేయడంతో పాటు స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అయితే తన వద్ద రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని స్థల రిజిస్ట్రేషన్‌ లో జాప్యం చేస్తున్నారని ప్రమోద్‌ కుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.  ఈ తంతుపై స్టేటస్ కో పాటించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే ఐదు కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఈ కేసుల విచారణ పూర్తి కాకముందే ఏడాది క్రితం ఆ స్థలాన్ని సురేష్ బాబు రానాకు అమ్మేశారు. గత నవంబరులో సురేష్ బాబుకు చెందిన కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘటనపై వ్యాపారి ప్రమోద్‌ గతంలో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.