Srikalahasti Politics: దక్షిణ కైలాసంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి ఆలయం పేరుతో నియోజకవర్గం కీర్తి ఘటించింది. 2019 ముందు వరకు తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా గెలుపు సాధించిన స్థానం ఇది. 2019లో అధికార పార్టీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపొందారు.


ఓటు బ్యాంకుతో సంబంధం లేదు


ఈ నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. పల్లె రెడ్లుగా పిలిచే వారు ఎక్కువగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అధికార పీఠాన్ని అధిష్టించారు. బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని అంటారు.  ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి.


నవరాత్నాల గుడి...


 తొలిసారిగా ఎమ్మెల్యే అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ పార్టీ పథకాలు అమలతో పాటు ఏకంగా నవరత్నాల గుడిని నిర్మించారు. కొవిడ్ సమయంలో సైతం అధికార పార్టీ ఫ్లెక్సీలతో ర్యాలీ చేపట్టి రాష్ట్రంలో విమర్శల పాలయ్యారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా గ్రామస్థాయిలో తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమార్తె, కుమారుడు సైతం తన తండ్రికి అండగా నిలుస్తూ గ్రామాల్లో పర్యటనలు చేశారు. ప్రతి గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఏదో ఒకటి చేయడం ఆయన ప్రత్యేకత. తమ ప్రభుత్వ పథకాలు.. తాము చేసిన అభివృద్ధి ప్రజలు తమకు మరోసారి అధికారాన్ని ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


బొజ్జల సుధీర్ రెడ్డి


తెలుగు దేశం పార్టీ తరపున 1989, 1994, 1999 హ్యాట్రిక్ విజయాలు, 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గా గెలుపొందారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసీ ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు లోపాలను ఎత్తి చూపుతున్నారు. స్యాండ్, ల్యాండ్ అంటూ సొంత అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సైతం రాజకీయాలను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 


నియోజకవర్గంలో ఎస్సీవీ నాయుడుకి ప్రత్యేక వర్గం ఉంది. ఆయన మద్దతుదారులు గెలుపోటములు నిర్ణయిస్తారనే భావన బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన ఆయన తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో తిరిగి తెదేపా లోకి చేరారు. తనకు తెలియకుండా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకోవడం... తర్వాత వాయిదా పడడంతో కొన్ని వదంతులు వినిపించాయి. ఆ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీవి నాయుడు.. చంద్రబాబు నాయుడుని కలవడంతో వాటికి పుల్ స్టాప్ పడింది.


జనసేన బలం...


నియోజకవర్గంలో జనసేన పార్టీ కి కొంత బలం ఉందని చెప్పాలి. ప్రజల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్నారు.  అన్ని మండలాల్లో జనసైనికులను కలుపుకోవడం లో కోటా వినుత, చంద్రబాబు వెనుకబడి ఉన్నా.. అదేమి పార్టీ పై ప్రభావం చూపదని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి కోలా ఆనంద్ సైతం తన సామాజిక వర్గం, పార్టీ తో పాటు కొంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తుంటారని అంటున్నారు. అధికార పార్టీ నాయకులు అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు అంటూ గలం విప్పుతున్నారు.


సీటు ఎవరికో..


అధికార వైసీపీ.. లేక టీడీపీ, జనసేన పార్టీ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి సీటు ప్రకటన చేయలేదు. దీంతో ఆశావాహులు సైతం ఏటూ తేల్చుకోలేక పోతున్నారు.  అన్ని పార్టీల ముఖ్య నాయకులు తమకే సీటు అంటూ ప్రజల్లోకి తిరుగుతున్నారు. అయితే  సీటు ప్రకటన వచ్చిన తరువాత రాజకీయం మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.