శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్(Electro Steel casting) ఎండీ ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్(CM YS Jagan) తో బుధవారం సమావేశమయ్యారు. భేటీ అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొందన్నారు. 22 ఏళ్లుగా డక్టయిల్ ఐరన్ ప్రెషర్ పైప్స్(Iron Presure Pipes) తయారీ రంగంలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ శ్రీకాళహస్తి(Srikalahasti)లోని తమ ప్లాంట్లో రానున్న కాలంలో రూ.1000 కోట్లతో 0.5 మిలియన్ టన్నులకు ఉత్పత్తిని విస్తరించే ప్రణాళికలు సీఎంకు వివరించామన్నారు. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రం సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. స్కూల్స్, ఆస్పత్రుల్లో నాడు నేడు కార్యక్రమాలు 16 మెడికల్ కాలేజీల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల(Infrastructure) కల్పన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేయడం సంతోషకరమని తెలిపారు. మొదటి సారి కలిసినా చాలా స్నేహపూర్వకంగా తమ సమావేశం జరిగిందని చక్కటి విజన్ తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైయస్.జగన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.


శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ డక్టైల్‌ ఐరన్‌ పైప్స్‌ తయారీలో దేశంలోనే ప్రముఖ కంపెనీగా పేరుగాంచింది. ఈ కంపెనీ తమ ఉత్పత్తులను 90కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఏపీలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఈ సంస్థ ఎండీ ఉమాంగ్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఉత్పత్తి సామర్థ్యం కూడా 0.5 మిలియన్‌ టన్నులు పెంచేలా ప్రణాళికలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి(MP Mithun Reddy) పాల్గొన్నారు. 


ఏపీతో ఎంవోయూలు 


ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్(Dubai) లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్‌ ఎక్స్‌పో వేదికను వినియోగించుకుంటుంది. దుబాయ్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే పెట్టుబుడుల సదస్సులో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. పెట్టుబడులు ఆకర్షణే లక్షంగా సాగుతున్న ఈ పర్యటనలో పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూ(MoU)లు చేసుకుంటుంది. ఇప్పటి వరకూ రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంగళవారం అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో పరిశ్రమల శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం(గిడ్డంగులు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ(Technology) అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.