Deepavali Village : దీపావళి అంటే అందరికీ టపాసులు, దీపాలు గుర్తొస్తాయి. ఆ ఊరి వాళ్లకు మాత్రం దీపావళి అంటే గుర్తొచ్చేది ఓ పేరు. అదే ఆ ఊరి పేరు. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఒక గ్రామానికి ఏకంగా ఊరి పేరునే పండగ పేరుగా పెట్టారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఆ ఊరి పేరు దీపావళి అదేంటి ఊరి పేరు దీపావళి అనుకుంటున్నారా ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్లి ఆ గ్రామస్తులు అడిగితే పెద్ద చరిత్రే చెబుతున్నారు.  



పేరు వెనుక ఓ కథ? 


దీపావళి పండగ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా  బాణసంచా కాల్చి ఎంతో ఆనంద ఉత్సాహంతో జరుపుకునే పండుగ. కానీ ఆ గ్రామంలో నిత్యం దీపావళి లాగానే ఉంటుంది. అసలు దీపావళి పేరు ఆ గ్రామానికి ఎందుకు వచ్చిందంటే దీని వెనకాల చరిత్ర ఉందంటున్నారు గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో దీపావళి ఒక గ్రామం.  పూర్వం కళింగ రాజులు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వెళ్లడానికి ఇదే రహదారి గుండా వెళ్లేవారు. అయితే కళింగరాజు కూర్మనాథుని దేవాలయంలో పూజలు చేసి అనంతరం తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఆ రాజుకు నీళ్లు ఇచ్చి రక్షించారని, అప్పుడు రాజు ఇది ఏ ఊరు నాయనా అంటే ఈ ఊరికి పేరు లేదని చెప్పడంతో దీపావళి రోజు నన్ను మీరు కాపాడారు కనుక ఇకపై ఊరు పేరు దీపావళి అని నామకరణం చేస్తున్నానని చెప్పారట. అప్పటి దీపావళి పేరుతో పిలుస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.  


ఐదురోజుల పాటు పండుగ  


గ్రామస్తులు దీపావళి పండుగని ఐదు రోజులు జరుపుకుంటారు. దీపావళిని పేరు పెట్టిన దగ్గర నుంచి ఆ ఊరు నిత్యం దీపం లాగే  వెలిగిపోతుంటుందని పంటలు సుభిక్షంగా పండుతున్నాయని అందరూ ఐక్యమత్యంగా ఉంటామని గ్రామస్తులు అంటున్నారు. ఏ సమస్య వచ్చినా సరే గొడవలకు వెళ్లకుండా కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. దీపావళి వచ్చిందంటే అన్ని పండగల కన్నా ఎంతో వైభవంగా జరుపుకుంటామని అంటున్నారు.  


దీపావళి అంటే అర్థం?


దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుతీరుతాయి. అసలు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. 'అజ్ఙానం'అనే చీకటిని తొలగించి 'జ్ఙానం'అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. 'దీపం' అంటే త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను'. అని దీపం వెలిగించి నమస్కరిస్తాం. భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకతే వేరు. దేవాలయం అయినా, ఇళ్లలో అయినా పూజ దీపంతోపే ప్రారంభిస్తాం. ఇంట్లో ఎలాంటి శుభాకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ.