Padmavati Women University Completed 41 Years: మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని.. వారిని ప్రగతి పథం వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో 1983 ఏప్రిల్ 14న  అప్పటి సీఎం నందమూరి తారకరామారావు  తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత విశాలమైన ప్రాంతంలో మహిళా సాధికారత దిశగా ఎన్టీఆర్ ఈ వర్శిటీకి శ్రీకారం చుట్టారు. ఈ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి 41 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ వర్శిటీ దేశంలో రెండో మహిళ యూనివర్సిటీగా  నిలిచింది‌. దక్షిణ భారతదేశంలోనే ఇదే మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ఆనాటి నుంచి నేటి వరకు వేలాది మంది విద్యార్థినులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోం.


ఇదీ ఘన చరిత్ర


తొలుత ఈ యూనివర్సిటీలో 2 పీజీ కోర్సులు, 4 డిప్లొమా కోర్సులు, ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, మరో సర్టిఫికెట్ కోర్సులతో 144 మంది విద్యార్థినులతో ప్రారంభమైంది‌. నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రఖ్యాత విశ్వ విద్యాలయంగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం 60కి పైగా కోర్సులు, 6 వేల మందికి పైగా విద్యార్థినులు, 1200 మందికి పైగా అధ్యాపకులు, సిబ్బందితో అలరారుతోంది. వృత్తి విద్య కోర్సులతో పాటు ఫుల్ టైం, పార్ట్ టైం కోర్సులు అందిస్తూ ఉపాధికి మార్గం చూపుతోంది. వర్శిటీ అభివృద్ధిని పరిశీలించి NAAC బృందం ఏ+ గ్రేడ్ ప్రకటించింది. అంతేకాకుండా ఐఎస్ఓ నుంచి సర్టిఫికెట్ కూడా పొందింది. ఇటీవలే పీఎం ఉష పథకం కింద రూ.100 కోట్ల నిధులు వర్సిటీకి మంజూరయ్యాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూనివర్సిటీలతో పరిశోధనలు, కోర్సు పూర్తి చేసే సమయానికి ఉద్యోగాలు కల్పించే దిశగా వర్శిటీ యాజమాన్యం ఒప్పందాలు చేసుకుంది. మహిళలకు నర్సింగ్ కోర్సు.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.


నైపుణ్యాలు పెంపొందించేలా


మహిళలకు విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యూజీసీ నెట్ కోచింగ్, బార్ కోడింగ్ సెంటర్, సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ టీవోటీ సెంటర్, ఎంట్రీ ఇన్ టూ సర్వీసెస్, ఉమెన్ స్టడీస్, ఎంటర్ ప్రెన్యూర్షిప్, గ్రూప్స్, ఏపీపీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు కావాల్సిన శిక్షణ అందించడమే కాకుండా దీనికి తగిన మెటీరియల్ కూడా అందిస్తున్నారు.


21వ స్నాతకోత్సవం


పద్మావతి మహిళ వర్శిటీ 21వ స్నాతకోత్సవం గురువారం నిర్వహించనున్నారు.  వీసీ డీ.భారతి ఆధ్వర్యంలో వర్సిటీలో 57 మంది విద్యార్థినులకు గోల్డ్‌మెడల్స్‌, 12 మందికి బుక్‌ ప్రైజ్‌లు, నలుగురికి నగదు బహుమతులు, 86 మంది విద్యార్థినులకు పీహెచ్‌డీ, ఇద్దరికి ఎంఫిల్‌, పీజీలో 771 మందికి, యూజీ డిగ్రీలు 567 మందికి, డిస్టెన్స్‌ మోడ్‌లో 50 మంది పీజీ, 72 మంది యూజీ విద్యార్థినులకు పట్టాలను అందజేయనున్నారు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ ఇండియన్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ పి.సుశీలకు వర్శిటీ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా వర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇస్రో మాజీ సైంటిస్ట్‌ మంగళమణి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


Also Read: CM Jagan: 'అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసమే చేయూత' - చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు