వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని ఎద్దేవా చేశారు. కానీ, ప్రస్తుతం నేరుగా రైతులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆక్వా రైతులకు టీడీపీ హయాంలో యూనిట్ రూ.2 కరెంటు అందిస్తే, వైసీపీ హయాంలో రూ.3 చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని సోమిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి రూ.10 వేల రైతు బంధు ఇస్తోందని, అక్కడ ధాన్యం సేకరణ బాగుందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పథకాలన్నీ మూలనపడేసిందని ఆరోపించారు. వాటన్నిటినీ తిరిగి అమలు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.


వ్యవసాయ రంగం, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్ ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా? అని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11 శాతం వృద్ధిరేటు నమోదైతే.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంత నమోదైందో చెప్పగలదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ రెండున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ధాన్యం కొనుగోళ్లలో అంతా దళారుల రాజ్యమైపోయి చివరకు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. వ్యవసాయమంటే  తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్‌కు నీటిపారుదలశాఖ అప్పగించారు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


‘‘టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9 వేలు ఇస్తే, జగన్ రైతు భరోసా కింద దాన్ని రూ.7,500 లకే పరిమితం చేశాడు. భూసార పరీక్షలు, బిందు, తుంపర సేద్యం పరికరాల పంపిణీ, రైతులకు అందించే సూక్ష్మ పోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వమే బిందు తుంపర సేద్యానికి 60 శాతం సబ్సిడీ ఇస్తుంటే కేవలం మిగతా 40 శాతం సబ్సిడీని భరించలేక సీఎం జగన్ ఆ పథకాన్ని నిలిపేశాడు’’ అని సోమిరెడ్డి ఆరోపించారు.


ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. 2019-20లో బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లే ఖర్చు చేసింది. అందులోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుచేయలేదు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి ఉందా?’’ అని సోమిరెడ్డి సవాలు విసిరారు.