Sharmila  letter to  Prime Minister: ప్రత్యేకహోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని మోదీకి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. 2014లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ కోసం అనేక  హామీలు ఇచ్చారని షర్మిల లేఖలో గుర్తు చేశారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  హామీల అమలుపై పెద్దగా దృష్టి పెట్టలేదన్నారు. పదేళ్లు అయినా విభజన హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని షర్మిల గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ దయనీయ స్థితిలో ఉందని  తక్షణం సహకారం అందించాల్సి ఉందన్నారు. విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 


కేంద్రం విభజన హామీల విషయంలో ఎలా మోసం చేసిందనడానికి ప్రత్యేకహోదా అనేది ముఖ్యమైన ఉదాహరణగా కనపిస్తోందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం వల్ల ఏపీ  ఇతర రాష్ట్రాలతో  పోటీ పడలేకపోతోందని తెలిపారు. లెవర్ ప్లేయింగ్ ఫీల్డ్ ను ఏర్పాటు చేయడానికి ఏపీకి తక్షణం ప్రత్యేకహోదా కావాలన్నారు.  అలాగే ప్రత్యేకహోదా అంత ప్రాధాన్యత కల పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం సరైన సహకారం అందించడం లేదన్నారు. ఐదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు.  ప్రస్తుతం  ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదున్నర కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున తాను లేఖ రాస్తున్నానని.. తక్షణం విభజన  హామీలను నెరవేర్చాలని కోరారు.                           


ప్రధాని మోదీకి షర్మిల రాసిన లేఖ కోసం క్లిక్ చేయండి


షర్మిల లేఖలో మొత్తం ఎనిమిది అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ  ఉక్కు ఆంద్రుల  హక్కు అని స్పష్టం చేశారు. మరో వైపు  మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేయాలని షర్మిలప్రయత్నిస్తున్నారు.  అధికార ప్రతిపక్షాలు దీన్ని పెద్దగా పెట్టించుకోకపోయినా కాంగ్రెస్ దీన్ని హైలెట్ చేస్తోంది. పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీతో కుమ్మక్కై అన్ని పార్టీలు పక్కన పెట్టేశాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని అంటున్నారు.                                                   


ప్రత్యేక హోదాను ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు షర్మిల బహిరంగ సభల్లో చెప్పడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయనున్నారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలుచెబుతున్నాయి.  . పదేళ్ల క్రితం ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని ఇది నమ్మక ద్రోహం అని నిరసన చేపట్టనున్నారు. దీనికి కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సీనియర్ లీడర్లు హాజరయ్యే అవకాశం ఉంది.