Vijayasai Reddy Resigned as Rajyasabha Member | న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ సీపీ నేత వి. విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి తన రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే శనివారం నాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 


జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశా..


అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లండన్ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడా. ఆ తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. వెన్నుపోటు వ్యాపారాలు, వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయాల నుంచి కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారు. నేను అబద్ధం చెప్పడం లేదు. నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం నాది. కేసులకో, ఎవరికో భయపడే వ్యక్తిని కాదు. భయమనేది నా బ్లడ్ లోనే లేదు. పదవికి న్యాయం చేయడం లేదని భావించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవరికైనా దమ్ముంటే నేను డబ్బులు తీసుకుని రాజీనామా చేసినట్లు నిరూపించండి’ అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.


వారి వ్యాపారాలతో ఏ సంబంధం లేదు


మా వియ్యకుండు నా క్లాస్ మేట్. తరువాత నేను ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను. ఆయన వ్యాపారంలోకి వెళ్లారు. నా కూతుర్ని ఆయన కొడుకుకు సంబంధం చేసుకున్నప్పుడే మరోసారి కలిశాను. వాళ్లకు ఏ వ్యాపారాలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలియదు. నేను నిరంతరం నా పనులు, రాజకీయాలపై మాత్రమే ఫోకస్ చేశా. కేవీ రావుతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. కాకినాడ పోర్ట్ విషయంలో నాకు ఏ సంబంధం లేదు. కానీ నన్ను ఏ2గా చేర్చారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు పంపింది నేనే అనేది నిజం కాదు.


కూటమికి ప్రయోజనం చేకూరుతుంది..


రాజకీయాల నుంచి తప్పుకుంటే నేను బలహీనుడ్ని అవుతాను. నాకు ఏ ప్రయోజనం ఉంటుందో మీరే చెప్పండి (మీడియాకు విజయసాయిరెడ్డి ప్రశ్న). ఓ పార్టీలో జనరల్ సెక్రటరీగా, అటు రాజ్యసభ సభ్యుడిగా న్యాయం చేయలేకపోతున్నాను. ఆ స్థానంలో మెరుగైన వ్యక్తి రావాలని భావించి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా. ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యత్వానికే రాజీనామా చేశా. వైసీపీ సభ్యుడిగా త్వరలో రాజీనామా చేస్తాను. నా రాజీనామా కూటమికే ప్రయోజనం చేకూరుస్తుంది. ఏ పదవులు ఆశించిగానీ, ప్రయోజనం కోసమో, కేసుల మాఫీ కోసమో రాజీనామా అనేది నిజం కాదు. ఓ మహిళ గురించి తనతో సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తే న్యాయపోరాటం చేశా. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు. 


బీజేపీలో ఎంపీ కావడం, గవర్నర్ పదవి ఆశించడం లాంటి ఉద్దేశంతో రాజీనామా చేయలేదు. విదేశాల్లో పర్యటించా, ఎన్నో విషయాలు నేర్చుకున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నం దోచేశాడని ప్రచారం జరిగింది. మంచి పౌండ్, ప్రాస ఉందని బాగా ప్రచారం చేశారు. కూతురు, అల్లుడు వాళ్లకు బాగానే ఆస్తులున్నాయి. వారి వ్యాపారాలతో నాకు లింక్ పెడితే చేసేదేం లేదు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మరోసారి చెబుతున్న. వైసీపీ 2019లో 151 సీట్లు నెగ్గింది, 2024లో 40 శాతం ఓటింగ్ సాధించింది. అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్. నాలాంటి వాళ్లు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు ఎలాంటి నష్టం లేదని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.


Also Read: Nara Lokesh: దావోస్ నుంచి తిరిగొచ్చిన నారా లోకేష్, గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం