Section 30 Act Implementation In Tirupati District: తిరుపతి జిల్లా (Tirupati District) వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోన్న క్రమంలో గత కొద్దిరోజులుగా తిరుమల వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు, ప్రముఖ నేతలు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ 24 వరకూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పలని ఎస్పీ హెచ్చరించారు.


మాజీ సీఎం జగన్ పర్యటన


మరోవైపు, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగుపయనమవుతారు.


అటు, జగన్ పర్యటన క్రమంలో.. ఆయన డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తామని బీజేపీ నేతలు, హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత అనుచరులతో కలిసి స్వామి వారి భజన చేసుకుంటూ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో తిరుపతికి వెళ్లారు. జగన్ చేసిన పాపానికి అందరూ స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేని.. తనతో పాటు రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ నేతలు సైతం జగన్ డిక్లరేషన్ ఇస్తేనే కొండపైకి రానివ్వాలని టీటీడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలకు రావాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ లేకుండా వస్తే స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని ప్రకటించారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఇప్పటికే ఆరోపించారు. జగన్ తిరుమలకు వస్తే తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగిన పటిష్ట చర్యలు చేపట్టారు. 


Also Read: KA Paul: 'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి' - కేఏ పాల్ సరికొత్త డిమాండ్