KA Paul Sensational Comments On Tirumala: ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ (KA Paul) తిరుమలపై (Tirumala) తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ వివాదం కొనసాగుతోన్న క్రమంలో 'తిరుమలను ప్రత్యేక దేశం'గా ప్రకటించాలనే ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఏపీ హైకోర్టు (AP High Court) లో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇటలీ ప్రభుత్వం 741 మంది క్యాథలిక్‌లో వాటికన్‌ను దేశంగా ప్రకటించగా 34 లక్షల మంది ప్రజలు, రూ.3 లక్షల కోట్ల ఆస్తులున్న తిరుపతిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించరని ప్రశ్నించారు. లేకపోతే ప్రత్యేక దేశంగానైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయని పాల్ ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీ, ఎస్పీలకు తగు ఆదేశాలు జారీ చేసి లడ్డూపై రాజకీయ ప్రచారం జరుగకుండా చర్యలు తీసుకోవాలని పిల్ వేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల లడ్డూపై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసి ఉండాలని , దీనిని రాజకీయం చేయవద్దని సూచిస్తూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు నోటీసులు పంపించనున్నట్లు పాల్ వెల్లడించారు.
పోలీసుల ఆంక్షలు
అటు, శుక్రవారం మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన క్రమంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ 24 వరకూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. 27న సాయంత్రమే జగన్ తిరుమలకు చేరుకుని 28న (శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తామని బీజేపీ నేతలు, హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.