SCR Jan Sadharan Special Trains: పండుగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ - విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ (అన్ రిజర్వుడ్) రైళ్లను నడుపుతున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ - విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ (08567) రైలు నవంబర్ 1, 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే, విజయవాడ - విశాఖ ప్రత్యేక రైలు (రైలు నెం. 08565) విజయవాడలో సాయంత్రం 6:30 గంటలకు బయల్దేరి రాత్రి 12:35 గంటలకు విశాఖ చేరుకోనుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
రిజర్వేషన్లపై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం
అటు, టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా.. దాన్ని 60 రోజులకు కుదించింది. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అయితే, నవంబర్ 1వ తేదీకి ముందు రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. కాగా, తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. అటు, విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పు లేదు.