Sajjala On Jagan : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు. దీంతో శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని సజ్జల స్పష్టం చేశారు. శాశ్వత అధ్యక్ష పదవిపై ఈసీ వివరణ కోరినట్లుగా వచ్చిన వార్తలపై సజ్జల స్పందించారు.  ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల తెలిపారు. ఆ తర్వాత ఎన్నిక జరగనున్నట్లు వెల్లడించారు. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు వివరించారు. శాశ్వత అధ్యక్షుడు పదవికి సంబంధించి స్పష్టత ఇవ్వమని ఎన్నికల సంఘం అడిగిందని, ఇదే అంశాన్ని ఈసీకి చెప్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


ప్లీనరీలో జగన్‌ను శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులు


ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.  ఈమేరకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు.. రఘురామ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్‌సీపీని వివరణ కోరినట్లుగా తెలుస్తోంది.సాధారణంగా  కేంద్ర ఎన్నికల సంఘం (EC) మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. 


ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులు ఉండరని స్పష్టం చేసిన ఈసీ 


ప్ర‌జాస్వామ్యంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు, శాశ్వత పదవులు ఉండబోవని.. ఆ ఎన్నిక చెల్ల‌ద‌ని ఎన్నికల సంఘం్పష్టం చేసింది. ఇలా చేయడం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని పేర్కొంది ఈసీ. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలోనే పార్టీపై పూర్తి స్తాయి పట్టు ఉన్న జగన్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారన్న విమర్శలకు ఆ పార్టీ ముఖఅయ నేతలు కౌంటర్ ఇచ్చారు. గతంలో కరుణానిధి కూడా డీఎంకేకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.   


ఐదేళ్లకోసారి ఎన్నిక ఉంటుందన్న సజ్జల !


ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి  సంస్థాగత ఎన్నికలను రాజకీయ పార్టీలు నిర్వహించాలి. ఏదైనా సమస్య వస్తే..  కాస్త ఆలస్యంగా నిర్వహించుకోవడానికి తాత్కలిక కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా..  వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న  సజ్జల రామకృష్ణారెడ్డి .. తాము ఐదేళ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని ఈసీకి చెబుతామని అంటున్నారు. ఇది చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది ఈసీ స్పందనతో తెలిసే అవకాశం ఉంది.  ఈ అంశంపై సీఈసీ రాసిన లేఖకు..  సమాధానం ఇచ్చిన తర్వాత ఈసీ స్పందనేమిటో తెలిసే అవకాశం ఉంది. 


ఊహించని వేగంతో ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారెందుకు ? అసలు రాజకీయం వేరే !