Telugu News: ఈనెల 15 నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా ప్రారంభయ్యే రెవిన్యూ సదస్సులను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ దోపిడి, దుర్మార్గపు చర్యల కారణంగా భూ సంబంధ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు రోజుకు వేల కొద్ది అర్జీలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలు తమ భూములను ఆక్రమించారంటూ రాష్ర్ట నలుమూల నుండి ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
22 ఏ సెక్షన్‌ను వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. రీ సర్వే పేరుతో తమ వారికి లాభం చేకూర్చేలా వైసీపీ నేతలు భూ రికార్డులను తారు మారు చేశారని ప్రతి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు ప్రతి గ్రామంలోనూ రెవిన్యూ సదస్సులు జరపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్ద రెవిన్యూ గ్రామాల్లో రోజంతా...చిన్న రెవిన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవిన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి తాహశీల్దార్ తోపాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుండి అర్జీల స్వీకరిస్తారని చెప్పారు.
ప్రతి అర్జీని అన్లైన్ చేసి అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యపైన విచారణ జరిపి ఏం చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకే రెవిన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని, ఏ గ్రామంలో ఎప్పుడు సదస్సులు నిర్వహిస్తారో ఈనెల 13వ తేదీ నాటికి షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పారు. రెవిన్యూ సదస్సులపై గ్రామ గ్రామాన స్థానిక మీడియా, కరపత్రాలు, పోస్టర్లు ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.