Shyamaladevi : సినీ నటుడు, మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 20వ తేదీన మొగల్తూరులో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చూసుకుంటున్నారు. 20వ తేదీన కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఇతర దేశాల నుంచి వైద్యులను రప్పించి అరుదైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. కృష్ణం రాజుకు ఈ ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని, ఆనయ లేకుండా మొగల్తూరు రావడం ఎంతో బాధగా ఉందని అన్నారు. కృష్ణంరాజు పేదలకు విద్యవైద్యం అందించాలని చెప్పేవారనిఅందుకే ఆయన జయంతి రోజు నాడు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొగల్తూరు శ్రీ అందే బాపన్న కళాశాలలో మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా అందుబాటులో లేని వైద్యం మొగల్తూరులో ఉచితంగా అందించాలని నిర్ణయించామని అన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన
కృష్ణంరాజు భార్య శ్యమలాదేవి కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంతోనే ఈ సారి జంయతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని బావిస్తున్నారు. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత రెండో జయంతి ఇది. గతం కంటే భిన్నంగా భారీగా చేయాలనుకోవడం వెనుక రాజకీయం ఉందని భావిస్తన్నారు. ఇదే అంశంపై శ్యామలాదేవి కూడా స్బందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తరువాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామల దేవి అన్నారు.
వైసీపీ నుంచి టిక్కెట్ ఆఫర్ వచ్చినట్లుగా ప్రచారం
నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటుబ్యాంక్. రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటోన్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలా దేవికి నర్సాపురం లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు ఇదే నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004లో కూడా పోటీ చేశారు గానీ విజయం దక్కలేదు.
రాజకీయాలపై శ్యామలాదేవికి ఆసక్తి ?
గతంలో తన భర్త కృష్ణంరాజు ప్రాతినిథ్యాన్ని వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలా దేవి వైసీపీ చేసిన ప్రతిపాదనలను అంగీకరించడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉండబట్టే భారీగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. నర్సాపురం అభ్యర్థిని వైసీపీ ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ రోజు శ్యామలాదేవి రాజకీయ ప్రకటన చేస్తే ఆ తర్వాత ఆమె పేరు ప్రకటించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.