YSRCP Kapu leaders meeting In Rajahmundry:  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలంతా  రాజమండ్రిలో కీలక భేటీ కానున్నారు. మరి కొంతసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పలు సందర్భాల్లో కాపు కీలక నాయకులంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేసి.. ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేస్తూ విరుచుకుపడుతున్నారు. రాజమండ్రి కేంద్రంగా జరిగే కీలక సమావేశంలో కేవలం పవన్ కల్యాన్ (Janasena Chief Pawan Kalyan)ను టార్గెట్ చేయడం, కాపులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి ఆ సామాజిక వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం ప్రధాన అజెండాగా తెలుస్తోంది. దీనికి సంబందించి రాష్టంలోని వైసీపీలో ఉన్న కీలక కాపు నాయకులంతా రాజమండ్రి తరలిరానున్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇలా అనేక మంది కీలక నాయకులంతా రాజమండ్రి తరలిరానున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి కేంద్రంగా జరగనున్న ఈ కాపు నేతల కీలక భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.


టీడీపీకి దగ్గర అవుతున్నారని..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మాటల తూటాలను మరింత పెంచారు. వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. ఓ సమావేశంలో చెప్పు చూపించడంతో పాటు పరుష పదజాలంతో విమర్శించారు. దానికి ప్రతి వ్యూహంగా పవన్ కల్యాన్ ను ఏవిధంగా మాటలతో ఢీకొట్టాలన్న అంశంపై ఈ కీలక సమావేశంలో అంతర్గత చర్చ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పవన్ కల్యాన్ పై మాటల స్థాయిని పెంచారు. పవన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, మూడు పెళ్లిళ్లపై సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడని విరుచకుపడ్డారు. పలు సందర్భాల్లో పేర్ని నాని, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా ఇలా కాపు కీలక నాయకులంతా తమ మాటల తూటాలను పేలుస్తున్నారు. పవన్ పై విరుచుకు పడుతున్నారు. 


కాపు సామాజిక వర్గ సమస్యలే ప్రధాన చర్చ... 
రాజమండ్రిలో ఈ రోజు జగరబోతున్న వైసీపీ కాపు నాయకుల సమావేశంలో ప్రధానంగా కాపు సమాజిక వర్గ సమస్యలే ప్రధాన చర్చ అని ఆ పార్టీ కాపు నేతలు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ అమలు, కాపులకు మరింత సంక్షేమం అందించే దిశగా ప్రణాళిక, కాపునేస్తం అమలు, కాపు విద్యార్థులకు ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాలతోపాటు నామినేటెడ్ పదవుల్లో కాపు నేతల ప్రాధాన్యత తదితర అంశాల్లో వైసీపీ అవలంభించిన విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కాపుల పక్షాన వైపీపీ ఉందని ఆ సామాజిక వర్గంలోకి బలంగా తీసుకెళ్లేందుకు చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం నిర్వహిస్తామని చెబుతున్న ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మారే అవకాశాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట పవన్ వైసీపీ మంత్రులు, నేతల విమర్శలు, కౌంటర్లకు స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించింది.