Bride Kidnap Attempt at Kadiyam- రాజమండ్రి: ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే గోదావరి జిల్లాలో పట్టపగలే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ కలకలం రేపింది. సినిమా సీన్ తరహాలో కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కళ్యాణ మండపం వద్దకు వచ్చి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దండగులు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చి, అక్కడున్న వారి కళ్లల్లో కారం కొట్టి, వధువును కిడ్నాప్ చేసేందుకు యత్నించడం సంచలనంగా మారింది.






అప్పటివరకూ ఆ ఫంక్షన్ హాల్ పెళ్లి వేడుకలతో సందడిగా ఉంది. కానీ ఒక్కసారిగా ఊహించని తీరుగా అలజడి చెలరేగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెళ్లి వారికి సంబంధించిన వ్యక్తుల్లా అక్కడి వచ్చారు. ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న కారం పొడిని పెళ్లి జరిపిస్తున్న వారి కంట్లో కొట్టారు. మొదట పెళ్లి కూతుర్ని పక్కకు లాగిపడేశారు. ఒవైపు అసలేం జరుగుతుందో బంధువులు తెలుసుకునే లోపే.. ఆ దుండగులు వధువును బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. ఇది గమనించిన ఓ బంధువు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు పెళ్లి కూతుర్ని పట్టుకున్నారు. బంధువుల అరుపులు, కేకలతో మిగతా వారు అలర్ట్ అయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, రాజమండ్రి రూరల్ లోని కడియంలో పట్ట పగలే జరిగిన కిడ్నాప్ యత్నం అమానుషం అంటున్నారు. ప్రేమ వ్యవహారం వల్ల ఇలా చేశారా, లేక ఆర్థిక లావాదేవిలు బెడిసికొట్టి కిడ్నాప్ యత్నం చేశారా.. లేక మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది.


అసలేం జరిగిందంటే..
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలోని కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదివారు. చదవే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు.


తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ప్రేమ, పెళ్లి విషయం ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. ఇంటికి వెళ్లిన వధువు స్నేహ సైతం తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పండింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం తెల్లవారు జామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరపువాళ్లు పద్మావతి, చరణ్ కుమార్, చందు, నక్కా భరత్ అక్కడికి వచ్చారు. అక్కడున్న వారిపై కారంచల్లి స్నేహను అపహరించేందుకు ప్రయత్నం చేశారు.


వెంకటనందు వధువు తరపు బంధువుల్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో బత్తిన వీరబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో దాడి, కిడ్నాప్, బంగారం చోరీ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ బి తులసీదర్  తెలిపారు.