Pithapuram News: పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సాయిధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ గెలిపించాలనిసాయి ధరమ్ తేజ్ ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై రాయి విసిరారు. అది ఆయన పక్క నుంచి వెళ్లిపోయి అక్కడ జనసేన కార్యకర్తకు తగిలింది. ఇదంతా వైసీపీ పనేనంటూ జనసేన, టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు. 


ఎన్నికల ప్రచారం కోసం సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి వస్తున్నారని జనసైనికులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయి ధరమ్‌ తేజ్ మాట్లాడే ప్రాంతంలో భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. బాణసంచా పేల్చారు. అదే టైంలో అటుగా వచ్చిన వైసీపీ శ్రేణులు కూడా పోటీగా బాణసంచా పేల్చారు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కవ్వింపు చర్యలకు జనసైనికుల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. వారు కూడా అటు నుంచి నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు చెప్పారు.


ఇలా సాయంత్రం వేళ తాటిపర్తి వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి నుంచి వారందర్నీ పంపేశారు. అనంతరం అక్కడకు వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ ప్రసంగించారు. పవన్ కల్యాణ్‌ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మంచి జరుగుతుందని వారినికి చెప్పారు. అక్కడ కాసేపు మాట్లాడిన సాయిధరమ్‌ తేజ్‌ చిన్నజగ్గంపేట వెళ్లిపోయారు. 


చిన్నజగ్గంపేట ప్రచారం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. ఆయన తాటిపర్తి జంక్షన్‌కు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు, వాటర్ బాటిళ్లు విసిరారు. ఇది అక్కడే ఉన్న జనసేన కార్యకర్తకు తగిలింది. సాయిధరమ్‌ తేజ్‌ పై నుంచి వెళ్లిపోయింది. 


తీవ్ర రక్తస్రావంతో ఉన్న జనసేన కార్యకర్తను స్థానికులు ప్రాథమిక చికిత్స చేసి బైక్‌పై ఆసుపత్రికి తరలించారు. ఇది వైసీపీ శ్రేణుల పనేనంటూ జనసైనికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేప్పట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని అందర్నీ అక్కడి నుంచి తరిమేశారు. సాయిధరమ్‌తేజ్‌ ప్రచారానికి మంచి స్పందన రావడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని జనసైనికులు నినాదాలు చేశారు. 






గాయపడిన జనసైనికుడిని ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన్ని కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌, పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వర్మ పరామర్శించారు. ఓటమి ఖరారు అయిన వైసీపీ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు నేతలు. ఇవి చూస్తూ ఊరుకోమని.. పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే ఎస్పీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కచ్చితంగా దాడులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు.