Special Tran For Mahakumbha Mela: ఉభయ గోదావరి జిల్లాల నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ ఇది. ఈ నెల 8న అంటే శనివారం కాకినాడ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలనుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేలా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇదిలా ఉంటే తాజాగా రైల్వేశాఖ కూడా కాకినాడ నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడంపై గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
కాకినాడ ఎంపీ విజ్ఞప్తితో స్పందించిన రైల్వేశాఖ..ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహా కుంభమేళాకు హాజరయ్యేందుకు గతంలో రైల్వే శాఖ కాకినాడ నుంచి ప్రయోగరాజ్‌కు ఫిబ్రవరి 20న ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది.
భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్టి ఉంచుకుని సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఏసీతో పాటు స్లీపర్ క్లాస్ బోగీలతో అదనంగా మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనవరి 20న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ ఫిబ్రవరి 8న మరో అదనపు రైలును ఏర్పాటు చేసింది.
Also Read: ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు డేంజర్ బెల్స్- మేల్కోకుంటే ముప్పు తప్పదు!
రైలు బయల్దేరేది ఇలా...కాకినాడ రైల్వే ష్టేషన్ నుంచి ఈనెల 8న శనివారం 07095 నెంబర్ రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు రెండు రోజుల తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోనుంది. ఇప్పటికే ఈ నెంబరుతో ఆన్‌లైన్లో కూడా టిక్కెట్ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే 20న ఓ ఏసీ బోగీలతో ఉండే ట్రైన్ మాత్రమే కాకుండా అంతకంటే ముందుగానే అంటే ఎనిమిదిన సామాన్య భక్తులకు ఈ రైలు అందుబాటులో ఉన్నందున తమ ప్రయాణాన్ని విరమించుకున్న వారుకూడా కుంభమేళాకు వెళ్లేందుకు సన్నధ్దమవుతున్నారు..
కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ లేఖకు స్పందిస్తూ రైల్వే శాఖ కాకినాడ నుంచి కుంభమేళాకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడంతో ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల అవసరానికి అనుగుణంగా ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ జిల్లా ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు - ఆర్‌బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు