రాజమండ్రిలో భానుడు ఉగ్ర రూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్య పనులుంటేనే బయటకు వెళ్తున్న ప్రజలు, మంగళవారం (మే 16) సూర్యుని ప్రచండతతో మరింత భయపడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 49 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరాయి. దీంతో ముఖ్యమైన పనులమీద బయటకు వచ్చిన వారు పార్కుల్లోనూ, చెట్ల నీడన సేద తీరుతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వివాహ వేడుకలు ఉన్నందున తప్పని పరిస్థితుల్లో ద్విచక్రవాహనాలపై బయటకు వెళుతున్న వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజమండ్రిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రత
వేసవి కాలంలో సాధరణంగానే అత్యంత ఎక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజమండ్రి పట్టణంలో మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత తారస్థాయికి చేరాయి. దీంతో రాజమండ్రి పట్టణంలో మధ్యాహ్నం నాటికి 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఓ పక్క విపరీతమైన ఉక్కబోత ఉండడంతో ప్రజలు అపసోపాలు పడుతున్నారు. విద్యుత్తు కష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. మధ్యాహ్నం పూట, రాత్రి వేళల్లో అప్రకటిత విద్యుత్తు కోతలతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏసీల వినియోగం బాగా పెరగడంతో లోడు పడి దీంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు ఏసీ థియేటర్లుకు వరుస కడుతున్నారు. కొంతమంది నదీపాయలు, కాలువల్లో స్నానాలు చూస్తూ సేద తీరుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కాకినాడ బీచ్‌కు ప్రజలు వరుస కడుతున్నారు. సాగర తీరంలో సేదతీరేందుకు ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.
Also Read: అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ - మళ్లీ ఎప్పుడు రావాలని చెప్పిందంటే?
వడదెబ్బకు పిట్టల్లా రాలుతోన్న జనాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 45 సెల్సియస్ వరకు రికార్డు కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఎంట్రుకోనలో కాజులూరి ప్రసాద్ అనే తాపీమేస్త్రీ వడదెబ్బకు మృత్యువాతపడ్డాడు. అలసటతో మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రసాద్ గాలి కోసం ఇంటిచెంతనే ఉన్న పొలం వెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా పడిపోయి మృతి చెందినట్లు కుటుంబికులు తెలిపారు. పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు వడగాల్పుల వల్లనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వడగాల్పులకు నలుగురు వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలిసింది. నానాటికీ పెరుగుతోన్న ఎండల తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉండి పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చూచిస్తున్నారు.
వర్షాల తరవాత మాసూళ్లలో రైతుల ఇబ్బందులు
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ సమయంలో కోతలు పూర్తిచేయని రైతులు ఇప్పుడు మాసూళ్ల బాట పట్టారు. అయితే, విపరీతంగా పెరిగిపోతున్న ఎండ తీవ్రతకు కూలీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అత్యధిక కూలీ ఇచ్చి కోతలు కోయించుకుంటున్నప్పటికీ ఎండ తీవ్రతలకు వడ గాలులు భరించలేక మాటిమాటికీ గట్టుఎక్కే పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు రైతులు.
Also Read: అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ - మళ్లీ ఎప్పుడు రావాలని చెప్పిందంటే ?