CBI To  YS Avinash Reddy :    వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. వాస్తవానికి ఇవాళే ఆయన సీబీఐ ఎదుట రాజరు కావాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చివరి క్షణంలో అవినాష్ రెడ్డి లేఖ రాశారు. నాలుగు రోజుల పాటు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. 19వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు. 


నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాలున్నాయన్న అవినాష్ రెడ్డి                           


వైఎస్ అవినాష్ రెడ్డి హాజరువుతారని ఉదయం వరకూ ప్రచారం జరిగింది.  ఆయన నిన్ననే  పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారు.  ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు.  అయితే   చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరో నాలుగు రోజుల సమయం కావాలని ఆడిగారు.  ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు.  ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే  అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు కూడా చెప్పింది. 


అరెస్ట్ చేస్తారని అవినాష్ రెడ్డి అనుకుంటున్నారా ? 
     
 అరెస్టులకు ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సీబీఐ ఇంకా .. అవినాష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ వివేకా హత్య కేసులో  సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది.  వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్రపైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. 


ఆరు సార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ


 హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీ లో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్‌ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని... ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. అందుకే విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారేమోనని అవినాష్ రెడ్డి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి ఆరు సార్లు ఎంపీ అవినాష్ సీబీఐ ముందు హాజరయ్యారు. ఇప్పుడు ఏడో సారి హాజరు కావాల్సి ఉంది.