Rajahmundry Road cum Rail Bridge:
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం మూసివేయాలని నిర్ణయించారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ - తూర్పు గోదావరి జిల్లా - సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులతో పాటు వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లకు మరమ్మతులు చేయనున్నారు. దాంతో నెల రోజులపాటు రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు


సెప్టెంబర్ 27  బుధవారం నుంచి అక్టోబర్ 26 వరకు నెల రోజులపాటు రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను మళ్లించడానికి జిల్లా ఆర్ అండ్ బి అధికారి అభ్యర్థించారు. ఈ క్రమంలో ఈ వంతెనపై పూర్తిగా మేరకు ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్- కమ్- రైల్ బ్రిడ్జి (అప్రోచ్‌లతో సహా) యొక్క క్యారేజ్‌వే బాగా దెబ్బతినడం వల్ల, మరమ్మత్తు పనులకు సులువుగా ఉండేలా తక్షణ పునరుద్ధరణ కోసం వాహనాలను దారి మళ్లించాలని అధికారులు భావించారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేసేందుకు, ఏ ఇబ్బంది కలగకూడదని వాహనాల రాకపోకలను పూర్తిగా నెల రోజుల పాటు నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.  


రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జికి మరమ్మతులు చేయడానికిగానూ వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా బి . టి. క్యారేజ్‌వే పునరుద్ధరణ చేయనున్నారు. 0 కి. మీ.ల నుంచి 4.473 కి.మీ.ల పొడవు దెబ్బతిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్‌లకు చెందిన ప్రత్యేక మరమ్మత్తు పనులు రూ.210 లక్షలతో చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పటికే మిల్లింగ్ మిషన్ తో బిటి సర్ఫేస్‌ను తొలగించడంతో పాటు మిగతా పనులు చేపట్టారు. కనుక ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించనున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి పోలీసు సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ల నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులో చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా అవసరమైన చర్య తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ బ్రిడ్జి తాత్కాలిక మూసివేతపై ముందస్తుగా సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.